Begin typing your search above and press return to search.
బాబు అడుక్కోవాలంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 30 Sep 2017 1:31 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం అంటే ఇటీవలి కాలంలో ఎన్నో ముచ్చట్లు, ఆసక్తికరమైన అంశాలు, కొత్త కొత్త సూత్రీకరణలకు వేదికగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో తప్ప విలేకరుల ముందుకు రాని కేసీఆర్ తన ఎంట్రీ ఇచ్చిన సమయంలో రాష్ట్రం నుంచి మొదలుకొని రాజకీయాల వరకు, అంతరాష్ట్ర సంబంధాలు మొదలుకొని అంతర్జాతీయ అంశాల వరకు వివరిస్తున్నారు. ఇలానే తాజాగా జరిగిన విలేకరుల సమావేశంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు.
ఏపీ-తెలంగాణల మధ్య ఉన్న నీటి పంచాయతీ గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. ``పోతిరెడ్డిపాడుకు నీళ్లు కావాలంటే రిక్వెస్టు చేయాలి...అడుక్కోవాలి... అంతే తప్ప దాదాగిరిగా తీసుకెళ్తామంటే కుదరదంటే కుదరదు``అని కరాకండిగా తేల్చిచెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా జల విద్యు త్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టు, దీని నుంచి పోతిరెడ్డిపాడ్‌కు నీటిని ఎలా తీసుకెళ్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ``శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వకుండా నాగార్జునసాగర్‌కు నీరు ఎలా తీసుకెళ్తారని కృష్థా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ ఎలా అంటారు? శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్లితీరాల్సిందే.నాగార్జునసాగర్‌కు కానీ కృష్ణాడెల్టాకు కానీ జూరాల, ఆర్డీఎస్‌కు కానీ నికర జలాల కేటాయింపు ఉంది, వీటికి నీటిని వాడుకోవడానికి అధికారం ఉంది తప్ప పోతిరెడ్డిపాడుకు తీసుకెళ్లే అధికారం ఎవరికీ లేదు. మిగులు జలాలు ఉంటే తీసుకెళ్లవచ్చు, అది కూడా రిక్వెస్టు చేసి తీసుకెళ్లవచ్చు అంతే కానీ నాగార్జునసాగర్‌కు ఎలా తీసుకెళ్తారని ఆంధ్ర సర్కార్ అనడమంటే మొగణ్ణికొట్టి మొగసాలకే ఎక్కడమే`` అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా విపక్షాలపై సైతం సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ``ప్రపంచంలో రైతులను ఆర్గనైజ్డ్ ఫార్మాట్‌లోకి తెచ్చిన మొగోడు ఎవరూ లేరు. బీబీసీ న్యూస్, అల్‌జజీరా చానళ్లలో కొన్ని వందలసార్లు వచ్చాయి. లండన్, ప్యారిస్‌వంటి నగరాల్లో రైతులు తాము పండించిన ఆలు, టమాట లాంటి వాటికి ధరలు లేకపోవడంతో బజార్లో పారబోస్తున్న దృశ్యాలను ఆ చానళ్లలో నేను చూశాను. కనీస మద్దతు రాబట్టడంలో ప్రపంచ రాజ్యాలే విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి మేం రైతులను ఒక సంఘటిత రూపంలోకి తీసుకువస్తుంటే.. దానికి నిరసన తెలుపుతామంటే...ఎలా? మెంటలైపోయిన్రా వీళ్లు? రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేస్తే కోర్టుకు పోతున్నారు. ఇంత అసహనం ఏంది మీకు? రైతులు నవ్వుకుంటరు. ఇదా రాజకీయం? మీ జీవితంలో ఒక్క ఎరువు బస్తా ఇప్పించారా మీ ముఖానికి? ఇప్పుడు ఎరువులు, విత్తనాల కొరత ఉందా? కరెంటు బాధలు ఉన్నాయా? ఒకప్పుడు చెప్పులు లైన్లలో పెట్టే పరిస్థితి ఉండే! పోలీస్‌స్టేషన్‌లో అమ్మించిన ముఖాలు మీవి. రైతులపై లాఠీచార్జీలుచేశారు. అప్పుడు కరెంటు ఎట్ల ఉండే? కరెంటు బాధలు ఇప్పుడు ఉన్నాయా?`` అని ప్రశ్నల వర్షం గుప్పించారు.
విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ``ఖమ్మంకు పత్తి, మిర్చి వస్తయి. వరంగల్‌కు పత్తి వస్తుంది. మార్కెట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన ధాన్యం.., భళ్లున కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం.. తగ్గిన ధర అని మీడియా ప్రచారం చేస్తుంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండటానికే సమన్వయ సమితులు. కానీ అర్థం చేసుకోని ప్రతిపక్షాలు సిగ్గుమాలినోళ్లు అర్థం చేసుకోవడం రాలేని వాళ్లు`` అని మండిపడ్డారు.