Begin typing your search above and press return to search.

మోడీకి ఏం రోగం ఉందో చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   22 Nov 2018 6:26 AM GMT
మోడీకి ఏం రోగం ఉందో చెప్పిన కేసీఆర్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై తెలంగాణ అప‌ద్ధ‌ర్మ సీఎం - గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏకంగా ఆయ‌న‌కు బీమారీ ఉంద‌ని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల - ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ - నకిరేకల్‌ - భువనగిరి - మెదక్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన ప్రసంగించారు. 'ప్రధాని మోడీకి హిందూ - ముస్లిం అనే తేడా బీమారీ ఉన్నది. గిరిజనుల - ముస్లింల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపితే పెడచెవిన పెట్టాడు. ఆయనను 20సార్లు కలిశా. 50 ఉత్తరాలు రాశా. మన రిజర్వేషన్లు మనకిచ్చేందుకు కేంద్రానికి ఏం రోగం? ఈ విషయంలో కాంగ్రెస్‌ - బీజేపీ రెండూ తోడుదొంగలే' అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘాటుగా విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ - టీడీపీ - బీజేపీల‌పై కేసీఆర్ విరుచుకుప‌డ్డారు. ``బీజేపీ - కాంగ్రెస్‌ దొందూ దొందే. ఒకరిది కాషాయం జెండా - మరొకరిది మూడు రంగుల జెండా అంతే తేడా. కేసీఆర్‌ ఒక పని మొదలు పెడితే కొసదాకా తెగిస్తాడని మీకు తెలుసు. కేంద్రంతో కొట్లాడి కచ్చితంగా రిజర్వేషన్లు తీసుకొస్తా' అని కేసీఆర్‌ హామీనిచ్చారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే కేంద్రంపై ప్రాంతీయ పార్టీల పెత్తనం ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేసి నాన్‌ కాంగ్రెస్‌ - నాన్‌ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాలపై కేంద్రం కర్ర పెత్తనాన్ని అడ్డుకుంటానని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం ఇప్పటికీ అభివృద్ధి పేరుతోనే నడుస్తోందని కేసీఆర్‌ అన్నారు. పదేళ్లు దత్తత తీసుకున్న చంద్ర బాబు వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాకు ఏమి ఒరగబెట్టాడని ప్రశ్నించారు. ప్రతిరోజూ పాలమూరు నుంచి ముంబయికి బస్సులు పోయేవని - ఇప్పుడు అవి పాలమూరుకే తిరిగొస్తున్నాయని చెప్పారు. అధికారంలోకి రాగానే పాత పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రెండింతలకు పెంచబోతున్నామని - నిరుద్యోగులకు భృతి రూ.3వేలు - వికలాంగులకు 3 వేలు - రైతుబంధు ఎకరాకు 10 వేలు - ఆసరా కింద మరిన్ని పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం కోసం ఓ ప్రత్యేక పథకం తెస్తామన్నారు. ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లడగడానికి రానున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ చీకటి అలుముకుంటుందన్నారు. సీమాంధ్ర పాలకుల పాలనలో ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుని చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. 42 కిలోమీటర్ల సొరంగం పనులు దశాబ్దాలుగా నడుస్తున్నా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ఏ తెలివితే టలతో ఒప్పుకున్నారో నల్లగొండ జిల్లా ప్రజలకు జానారెడ్డి - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు.