Begin typing your search above and press return to search.

ది కాశ్మీర్ ఫైల్స్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   21 March 2022 11:30 AM GMT
ది కాశ్మీర్ ఫైల్స్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X
దేశవ్యాప్తంగా 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వివేక్ రంజన్ అగ్ని హోత్రి దర్శకత్వంలో రూపొందిన కాశ్మీరీ పండిట్ల బాధను చెప్పే ఈ చిత్రంపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా లేకపోలేదు.

దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్రమోడీ సైతం ప్రశంసలు కురిపించారు. అయితే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ భేటిలో తొలి సెషన్ లో మాట్లాడిన కేసీఆర్ 'కాశ్మీర్ ఫైల్స్' సినిమాను కూడా ప్రస్తావించారు.

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే ఈ సినిమా విడుదల చేశారని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ లో హిందూ పండిట్లను చంపినప్పుడు అధికారంలో ఉంది ఎవరు? అని ప్రశ్నించారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో లేదా? అని కేసీఆర్ నిలదీశారు.

రైతుల సమస్యలు పక్కదోవ పట్టించడానికి ఈ సినిమాను తెరపైకి తెచ్చారని కేసీఆర్ విమర్శించారు. ఇక దేశానికి కావాల్సింది కాశ్మీర్ ఫైల్స్ కాదని.. డెవలప్ మెంట్ ఫైల్స్ అని సూచించారు.

యాసంగిలో ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కేంద్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'ను వదిలిపెట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. ఢిల్లీ వరకూ ఈ ఉద్యమం సాగాలని స్పష్టం చేశారు.

కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసిన తర్వాత కొంతమంది రెచ్చిపోతున్నట్టు కూడా వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా? లేదా? తిరిగి రేపుతుందా? అని ప్రకాష్ రాజ్ లాంటి వారు విమర్శలు గుప్పించారు.