Begin typing your search above and press return to search.

ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డ‌ను.. కేసీఆర్ వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   21 March 2022 5:30 PM GMT
ఈడీ దాడుల‌కు భ‌య‌ప‌డ‌ను.. కేసీఆర్ వ్యాఖ్య‌లు
X
కేంద్ర ప్రభుత్వం తనపై ఈడీ దాడులకు దిగినా భయపడనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటివి అన్నిచోట్ల పనిచేయవని అన్నారు. బోడి బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకే తాను ప్రయత్నాలు చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చాలా శూన్యత ఉంది. అందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. దేశంలో కొత్త జాతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

``ప్రశాంత్‌ కిశోర్‌ నాతో కలిసి పనిచేస్తున్నాడు. అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.దేశంలో పరివర్తన కోసం నేను ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసిపనిచేస్తాను. గత 8 ఏళ్లుగా పీకేతో నాకు స్నేహం ఉంద``ని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా బలపడే ఆలోచన తప్ప యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. బీజేపీకి ప్రొగ్రెసివ్‌ ధోరణి లేదు.

బీజేపీ పాలనలోనే బ్యాంకుల స్కామ్‌లు పెరిగాయని కేసీఆర్ అన్నారు. 11 లక్షల కోట్లు బ్యాంకులు మాఫీ చేస్తాయి కానీ ధాన్యం కొనుగోళ్లకు 11 వేల కోట్లు లేవా? అని సీఎం ప్రశ్నించారు. ఆహారభద్రత బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు. కరువు వస్తే వారంరోజులు ప్రజలకు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదు. దేశంలో నేషనల్‌ ప్రొక్యూర్మెంట్‌ పాలసీ ఉండాలన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదన్నారు. అన్ని సూచీల్లో భారతస్థానం దిగజారుతోందని కేసీఆర్ ఆరోపించారు.

కేవలం ధాన్యంతోనే మా ఉద్యమాన్ని ఆపబోమ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు మరిన్నిఆంశాలతో ముందుకు పోతామన్నారు. అనేక అంశాలపై కేంద్రంతో పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు ప్రజలను ఉద్వేగాలకు గురిచేస్తున్నారని అన్నారు. దుర్మార్గపు రాజకీయ క్రీడ దేశంలో కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. దీని నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు తాము న‌డుం బిగిస్తామ‌న్నారు.