Begin typing your search above and press return to search.

నా టార్గెట్ ప్ర‌ధాని ప‌ద‌వి కాదు... కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   28 April 2022 4:38 AM GMT
నా టార్గెట్ ప్ర‌ధాని ప‌ద‌వి కాదు... కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
జాతీయ రాజ‌కీయాలపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త‌న ఆలోచ‌న‌ను ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా బ‌హిరంగంగానే వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా హైద‌రాబాద్‌లో జ‌రిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీలో త‌న అభిప్రాయాల‌ను పార్టీ ముఖ్యుల‌కు వెల్ల‌డించారు. అయితే, జాతీయ రాజ‌కీయాల్లో త‌ను చేప‌ట్ట‌బోయే ప‌ద‌వి, వాటిపై త‌న‌కున్న ఆస‌క్తిని కేసీఆర్ వెల్ల‌డించారు. త‌న‌కు ప్ర‌ధాని ప‌ద‌వి అక్క‌ర్లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించేశారు. అంతేకాకుండా త‌మ ద‌గ్గ‌ర ఉన్న వెయ్యి కోట్ల గురించి కేసీఆర్ వెల్ల‌డించారు.

తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన.. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికి, గ‌తిని, స్థితిని మార్చ‌డానికి, దేశాన్ని స‌రైన ప్ర‌గ‌తి పంథాలో న‌డిపించ‌డానికి హైద‌రాబాద్ వేదిక‌గా కొత్త ఎజెండా, ప్ర‌తిపాద‌న‌, సిద్ధాంతం త‌యారై దేశం న‌లుమూల‌ల వ్యాపిస్తే ఈ దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ గుంపు కాదు.. కూట‌మి కాదు...ప్ర‌త్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలని కేసీఆర్ పేర్కొన్నారు. ''ఫ్రంట్ లు - టెంట్ లు అనేది ముందుకు సాగవు. ప్రధాని కుర్చీ అనేది మన లక్ష్యం కాదు. దేశానికి కొత్త ఎజెండాను తయారు చేయడానికి నేను ఒక సైనికున్ని అవుతాను. ఇందుకోసం జాతీయ రాజకీయాల పై దేశ- విదేశాల నుంచి ముఖ్యమైన చర్చలు 15 రోజులు త్వరలో జరుపుతాం. IAS, రిటైర్డ్ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లో సమావేశం పెడుతాను.'' అని కేసీఆర్ త‌న ఆలోచ‌న‌ను పంచుకున్నారు.

త‌మ ద‌గ్గ‌రున్న వెయ్యి కోట్ల ఆస్తులు, డ‌బ్బుల గురించి సీఎం కేసీఆర్ వివ‌రించారు. టీఆర్ఎస్‌ పార్టీకి 861కోట్లు నిధులు ఉన్నాయని, ఎస్‌బీఐ-బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఈ నిధులు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలియ‌జేశారు. త‌మ డిపాజిట్ల‌కు 3కోట్లా 81లక్షల వడ్డీ ప్ర‌తి నెలకు వస్తోందని తెలిపారు.

''పార్టీకి రెండు ఇన్నోవా కార్లు- ఒక ఫోర్ట్ వాహనం ఉంది. అన్ని కలిపి 865కోట్లు నిధులు మనకు ఉన్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాలు కలిపితే సుమారు 1వెయ్యి కోట్లకు పైగా నిధులు ఉంటాయి'' అని వివ‌రించారు. జాతీయ పార్టీ కోసం ఫండ్ కావాలంటే టీఆరెస్ కు ఉన్న 60లక్షల సభ్యత్వమే త‌మ బలం అని కేసీఆర్ వివ‌రించారు.

60లక్షల సభ్యత్వం ఉన్న మన‌కు తలా ఒక్క వెయ్యి రూపాయలు ఇచ్చినా 600 కోట్లు అవుతుంది అని తెలియ‌జేశారు. జాతీయ పార్టీ అంటే దాతలు ఇప్ప‌టికే విరాళాలు ఇచ్చారని కేసీఆర్ తెలియ‌జేశారు. మొత్తంగా జాతీయ రాజ‌కీయాల‌పై త‌న లెక్క‌లు ఏంటో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ వెల్ల‌డించారు.