Begin typing your search above and press return to search.

కేసీఆర్ పుణ్యమా అని బుల్లి సంజయ్ కాస్తా బడా సంజయ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   10 Nov 2021 8:36 AM GMT
కేసీఆర్ పుణ్యమా అని బుల్లి సంజయ్ కాస్తా బడా సంజయ్ అయ్యారా?
X
అగ్రస్థానానికి చేరుకోవటం కష్టం. శ్రమించి అగ్రస్థానానికి చేరుకోవటం ఒక ఎత్తు అయితే.. దాన్ని నిలుపుకోవటం అంతకు రెట్టింపు కష్టమే కాదు శ్రమ కూడా. ఈ విషయం తెలిసిన వారంతా అగ్రస్థానానికి చేరిన తర్వాత మరింత అప్రమత్తంగా ఉంటారు. ఏ క్షణంలో అయినా ఆ స్థానం చెదిరే అవకాశం ఉండటంతో.. దాన్ని కాపాడుకోవటం కోసం వారికున్న శక్తియుక్తుల్ని అమితంగా వినియోగిస్తారు. ఆ మాటకువస్తే.. అగ్రస్థానం ఇచ్చే ఆనందం కంటే..ఆ స్థానాన్ని పదిలంగా దాచుకోవటానికి పడే శ్రమే ఎక్కువగా ఉంటుందంటారు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయ రంగంలో మాత్రం ఇదో వైకుంఠపాళిగా చెప్పక తప్పదు.

ఏ క్షణంలో అయినా ఏ కట్ల పాము అయినా కాటేసే ప్రమాదం రాజకీయంలో పొంచి ఉంటుంది.దీనికి అతీతమైన వారు చాలా చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని రాజకీయ చాణుక్యం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంతం. ఒకప్పుడు మంత్రి వర్గంలో స్థానం కోసం ఆరాటపడిన ఆయన.. ఈ రోజున అలా ఆరాటపడేవారు డజన్ల కొద్దీ తన చుట్టూ తిప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇదంతా కాల మహిమ మాత్రమే. ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించి ఉంటే మరోలా ఉండేది. తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పుడు మనసు ఎప్పుడూ సత్యం చుట్టూ తిరిగేందుకు పెద్దగా ఇష్టపడదు.

బండి సంజయ్ అనేటోడు చాలా చిన్నోడంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని మీదకు ఎక్కించుకొని.. సొంతంగా పార్టీ పెట్టిన వేళలోనే కాదు.. 2009లోనూ కేసీఆర్ ఎంత పెద్ నాయకుడో అందరికి తెలిసిందే. ఒక అడుగు ముందుకుపడితే.. రెండు అడుగులు వెనక్కి పడే పరిస్థితి. అలాంటి ఎన్నోచేదు అనుభవాల్ని చవి చూసి.. ఇప్పుడున్న స్థానానికి చేరుకున్న కేసీఆర్.. గతాన్ని ఎందుకు మర్చిపోతారు. బీజేపీకి తెలంగాణలో ఉన్న బలం ఎంత? అన్న కేసీఆర్ మాటల్ని విన్నప్పుడు.. నాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న దివంగతమహానేత వైఎస్.. నాటి టీఆర్ఎస్ విపక్ష నేత ఈటలను ఉద్దేశించి అన్న మాటలు అప్రయత్నంగా గుర్తుకు రాక మానదు.

అసలు పార్టీనే ఉంటుందా? లేదా? అనే పరిస్థితి నుంచి ఇప్పుడో బలమైన పార్టీగా టీఆర్ఎస్ మారింది. అయితే.. అలా జరగటం వెనుక ఏమేం జరిగిందన్న విషయం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు.అలాంటప్పుడు చిన్నబుచ్చే మాటలు.. తేలిగ్గా తీసిపారేసే మాటలు అహంకారానికి నిదర్శనంగా నిలుస్తాయన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోవటం దేనికి నిదర్శనం? నిజానికి మూడు రోజుల క్రితం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టక ముందు వరకు బండి సంజయ్ కు సంబంధించిన గ్రాఫ్ ఎంత? అన్నది అందరికి తెలిసిందే.

గడిచిన రెండు వరుస ప్రెస్ మీట్లు.. కేసీఆర్ ఆయనపై చేసిన వ్యాఖ్యలతో బండి గ్రాఫ్ ఎంతలా పెరిగిందన్నది ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన ఇచ్చిన పదునైన కౌంటర్.. గులాబీ బాస్ చిన్నబోయేలా చేసింది. ‘ఫాంహౌస్ కు వస్తే ఆరు ముక్కలు అవుతావు నా కొడకా’ అంటూ కేసీఆర్ విరుచుకుపడితే.. డేట్ చెప్పు.. టైం చెప్పు.. ఫాంహౌస్ కు రావాలా? ప్రగతిభవన్ కు రావాలా? ఎక్కడకు రావాలో చెబితే అక్కడకు వస్తా.. ఆరు ముక్కలు కాదు.. పది ముక్కలు అయ్యేందుకుసిద్ధం.. మరి టైం చెబుతావా? అంటూ విసిరిన సవాలుకు కేసీఆర్ ఏమని సమాధానం ఇస్తారు?

అందుకే అంటారు.. మాట అనటం ఎంత ముఖ్యంతో.. తాను టార్గెట్ చేసిన నేత నుంచి ధీటుగా రియాక్షన్ రాలేని విధంగా ఉండటం అంతే ముఖ్యం. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహం ఇదే. అప్పట్లో ఆయన ఏమన్నా..ఆయన మాటలకు స్పందించేందుకు సాహసించే ప్రయత్నం నేతలు ఎవరూ చేసేవారు కాదు. ఎందుకంటే.. అప్పట్లో ఆయనకున్న ప్రజాదరణ అలాంటిది. ఇప్పుడు మాత్రం ఆరు ముక్కలు చేస్తాను నా కొడకా అంటే.. పది ముక్కలు చేస్తారా? అంటూ ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోకి గులాబీ బాస్ వెళ్లారని చెప్పాలి. బండి సంజయ్ తన స్థాయి కాదంటూనే.. ఆయనపై రెండు రోజుల పాటు ప్రెస్ మీట్ పెట్టి ప్రాథమికంగా తప్పు చేసిన కేసీఆర్.. తనకు తెలీకుండా తానే బండి సంజయ్ స్థాయిని పెంచేశారన్న విషయాన్ని ఆయన ఇప్పటికైనా గుర్తించారా?