Begin typing your search above and press return to search.

ఆ విషయంలో కేసీఆర్ కి తమిళనాడే ఆదర్శం!

By:  Tupaki Desk   |   2 Jan 2017 2:24 PM GMT
ఆ విషయంలో కేసీఆర్ కి తమిళనాడే ఆదర్శం!
X
ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స అన‌గానే ఒక‌టికి రెండుసార్లు ఆలోచించేవారు మ‌న‌లో చాలామంది. అలాంటిది ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వాలకు వెళ్లేవారు ఏ కొద్దిమందో ఉంటారు. అక్క‌డి సౌక‌ర్యాల‌పై ప్ర‌జ‌ల‌కు ఉన్న భ‌యం అలాంటిది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కాన్పులు చేయించుకునేవారికి రూ. 6 వేలు ప్రోత్సాహ‌కంగా ఇస్తామ‌ని నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు క‌దా. అయితే, ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ఈ విష‌యంలో ముందుంది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో కాన్పు చేయించుకుంటున్న‌వారికి రూ. 12 వేలు చొప్పున ప్రోత్సాహ‌కం అందిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ మేర‌కు ఆద‌ర్శ‌వంతంగా మార్చాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. త‌మిళ‌నాడు మాదిరిగానే తెలంగాణ‌లో కూడా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల‌కు రావాలంటే సౌక‌ర్యాలు బాగుండాలి. అందుకే, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి సౌక‌ర్యాలున్నాయో... అక్క‌డ ప్ర‌స‌వాల సంఖ్య‌ను పెంచేందుకు తీసుకున్న ప్ర‌త్యేక చ‌ర్య‌లు ఏంటో అధ్య‌య‌నం చేసేందుకు ఒక బృందాన్ని సీఎం పంపించారు. త‌మిళ‌నాడులో 80 శాతానికిపైగా ప్ర‌స‌వాలు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో జ‌రుగుతుండ‌టం విశేషం. తెలంగాణ‌కు వ‌చ్చేస‌రికి కేవ‌లం ముప్ఫై ఒక్క శాతం మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. అందుకే త‌మిళ‌నాడులోని ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్‌.. కుటుంబ సంక్షేమ క‌మిష‌న‌ర్ వి. క‌రుణ‌..నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ యోగితారాణా... వికారాబాద్ క‌లెక్ట‌ర్ దివ్య‌ల బృందాన్ని అక్క‌డికి పంపించారు.

ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య‌ను పెంచేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌ద్ధ తీసుకుంటోంద‌ని ఈ బృందం తేల్చింది. రెగ్యుల‌ర్ గా ఆసుత్రుల్లో చెక‌ప్ చేయించుకుంటున్న గ‌ర్భిణుల‌కు ప్ర‌భుత్వం రూ. 12 వేలు ప్రోత్సాహకంగా ఇస్తోంది. ఆ మేర‌కు తెలంగాణ‌లో ల‌భిస్తున్న‌ది రూ. ఒక వెయ్యి మాత్ర‌మే. తెలంగాణ‌లో దాదాపు 70 శాతం ప్ర‌స‌వాలు ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనే జ‌రుగుతున్నాయి. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు వ‌స్తున్న‌వారు 30 శాతం మంది మాత్ర‌మే. జ‌న‌నీ సురక్ష‌, శిశు సుర‌క్ష ప‌థ‌కాల ద్వారా రూ. 1 వెయ్యి ప్రోత్సాహ‌కం, భోజ‌నానికి వంద‌, సిజైరిన్ చేయించుకున్న‌వారికి ఐదు రోజుల‌కు రూ. 500... ఇలాంటి కొన్ని ప్రోత్సాహాలు అందిస్తున్నా కూడా ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు ప్ర‌స‌వాల‌కు వ‌స్తున్న‌వారి సంఖ్య‌ చాలా త‌క్కువే ఉంటోంది.

మొత్తం కాన్పుల్లో 30 శాతం మాత్ర‌మే ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో... ఈ సంఖ్య‌ను క‌నీసం 50 శాతానికి పెంచాల‌ని వైద్య శాఖ‌ను ఆదేశించించారు. మ‌రి, త‌మిళ‌నాడు మాదిరిగానే ప్ర‌స‌వాల కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు వ‌చ్చేవారి సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి. ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల‌పై దృష్టి పెడితే ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం పెరుగుతుంది. ప్ర‌భుత్వ ఆసుప‌త్రులే స‌రిగా ఉంటే, ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళ్లి అప్పులపాలు కావాల‌ని ఎవ‌రైనా ఎందుకు అనుకుంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/