Begin typing your search above and press return to search.

కేంద్రానికి ‘కొత్త’ ఆశల చిట్టా పంపిన కేసీఆర్

By:  Tupaki Desk   |   14 Oct 2016 5:07 AM GMT
కేంద్రానికి ‘కొత్త’ ఆశల చిట్టా పంపిన కేసీఆర్
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున పనులు చేయించే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లానింగ్ పక్కాగా ఉంటుంది. కొత్తగా జిల్లాల్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. తాము చేపట్టిన జిల్లాల పునర్విభజనకు సంబంధించిన పూర్తి వివరాల్ని.. చేసిన కసరత్తును తాజాగా కేంద్రానికి నివేదిక రూపంలో పంపింది. కొత్త జిల్లాలకు సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపటానికి కారణం లేకపోలేదు.

కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్ని దేశంలోని జిల్లాల జాబితాలో కేంద్రం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి అయితే కానీ.. జిల్లాల వారీగా కేంద్రం కేటాయించే నిధులు దగ్గర నుంచి.. జిల్లాలకు అవసరమైన పాలనా సిబ్బందిని కేంద్రం కేటాయించే వీలు పడదు. కొత్తజిల్లాలు ప్రారంభించిన నేపథ్యంలో పలు మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. వాటి సాధనకు కేంద్రం చేయూత తప్పనిసరి. ఇక.. పరిపాలనా సౌలభ్యం కోసం ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు అవసరమవుతారు. వారి కేటాయింపులు కేంద్రం చేతిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలకు సంబంధించి తమ అవసరాల్ని.. తాము చేసిన కసరత్తును.. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల వివరాల్ని కేంద్రానికి పంపిన తెలంగాణ సర్కారు.. పనిలో పనిగా తమ కోర్కెల చిట్టాను కూడా జత చేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఐఏఎస్.. ఐపీఎస్ ల కొరత తీవ్రమైందని.. తమకున్న అవసరాల నేపథ్యంలో కొత్త పోస్టులను మంజూరు చేయాలనికి కేంద్రానికి కేసీఆర్ సర్కారు విన్నవించింది. 2016 బ్యాచ్ లో తెలంగాణకు పెద్ద ఎత్తున ఐఏఎస్.. ఐపీఎస్ లను కేటాయించాలని కోరింది. కొత్త జిల్లాల్లో విద్యా రంగ అభివృద్ధి కోసం 21 నవోదయ విద్యాలయాల్ని ప్రారంభించాలని.. 21 కేంద్రీయ విద్యాలయాల్ని మంజూరు చేయాలని కోరింది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కొన్నింటిని వామపక్ష తీవ్రవాద ప్రభావిత పథకంలో చేర్చి వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోలీసు బలగాల అవసరం పెరిగిందని.. అందుకు తగ్గ నిధుల అవసరాన్ని పేర్కొంది. కొత్త రైలు మార్గాలు.. జాతీయ రహదారుల మంజూరుకు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్ని ప్రాతిపదికగా తీసుకోవాలన్న వినతిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కొత్తజిల్లాలకు తగ్గట్లే కేసీఆర్ సర్కారు కేంద్రానికి పంపిన కోర్కెల చిట్టా కూడా భారీగానే ఉందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/