Begin typing your search above and press return to search.

కేసీఆర్ సెంటిమెంట్ల కొత్త ఖ‌ర్చు రూ.500 కోట్లు!

By:  Tupaki Desk   |   19 Jun 2019 8:26 AM GMT
కేసీఆర్ సెంటిమెంట్ల కొత్త ఖ‌ర్చు రూ.500 కోట్లు!
X
పాల‌కుల‌కు న‌మ్మ‌కాలు ఉండాలి. అవేవీ మితిమీరిన‌ట్లుగా ఉండ‌కూడ‌దు. దుర‌దృష్ట‌వ‌శాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీరు చూస్తే.. షాకింగ్ గా మారుతోంది. త‌న న‌మ్మ‌కాల‌కు త‌గిన‌ట్లుగా.. పాత భ‌వ‌నాల్ని కూల్చేసి.. కొత్త భ‌వ‌నాల్ని కట్టేసే విష‌యంలో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. అందుకు పెట్టాల‌నుకుంటున్న ఖ‌ర్చు లెక్క చూస్తే గుండె గుభేల్ మ‌న‌క మాన‌దు. ఈ రోజుకి హైద‌రాబాద్ స‌రిగ్గా రెండు కిలోమీట‌ర్ల రోడ్డు స‌రిగ్గా ఉన్న‌ది లేదు. అంత‌దాకా ఎందుకు హైద‌రాబాద్ మ‌హానగ‌రం మొత్తం వాట‌ర్ లైన్ లేదు.

వాట‌ర్ లైన్ ఉన్నోళ్ల‌కు నేటికి రోజూ నీళ్లురాని ప‌రిస్థితి. రోడ్ల మీద‌కు వాహ‌నాల్లో వ‌స్తే.. గంట‌కు 30 కిలోమీట‌ర్ల కంటే త‌క్కువ మాత్ర‌మే ప్ర‌యాణించే దౌర్భాగ్య ప‌రిస్థితులున్నాయి. ఇలాంటివేళ రూ.500 కోట్ల ఖ‌ర్చుతో అత్యాధునిక హంగుల‌తో కొత్త స‌చివాల‌యం.. కొత్త అసెంబ్లీ భ‌వ‌నాలు అవ‌స‌ర‌మా? అన్న‌ది ప్ర‌శ్న‌.

ఈ రోజుకీ హైద‌రాబాద్ లో స‌రైన మురుగునీటి వ‌స‌తి.. బ‌స్తీల్లో క‌నీస మౌలిక స‌దుపాయాలు లేని ప‌రిస్థితి. ఇలాంటివేళ‌.. అలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి.. కొత్త అసెంబ్లీ.. కొత్త స‌చివాల‌య భ‌వ‌నాల అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఒక‌వేళ‌.. అందులో వ‌స‌తులు స‌రిగా లేవంటే.. రూ.50 కోట్లు ఖ‌ర్చుపెడితే..చ‌క్క‌గా మార్చుకునే వీలుంది. కానీ.. న‌మ్మ‌కాల‌కు పెద్ద పీట వేస్తూ.. సెంటిమెంట్ ప్ర‌కారం పాత వాటిని కూల్చేసి.. కొత్త‌వాటిని నిర్మిస్తే కానీ మ‌న‌సు మూల‌ల్లో ఉన్న గిలి పోని ప‌రిస్థితి.

తాజాగా వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం కొత్త స‌చివాల‌యం.. కొత్త అసెంబ్లీ భ‌వ‌నం కోసం రూ.500 కోట్లు ఖ‌ర్చు కానున్న‌ట్లు చెప్పారు. ఇప్పుడున్న చోట స‌చివాల‌యాన్ని నిర్మిస్తామ‌ని.. ఐదు నుంచి ఆరు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాల‌యం ఉంటుంద‌న్నారు. ఇందుకోసం రూ.400 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా ప‌లువురు ఆర్కిటెక్చ‌ర్లు మంచి మంచి డిజైన్లు పంపుతున్నార‌ని.. వాటిని పరిశీలిస్తున్నామ‌ని.. ఈ నెల 27న భూమి పూజ చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇక‌..తెలంగాణ‌ అసెంబ్లీని 17 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మిస్తామ‌ని.. అందుకు 100 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు అవుతుంద‌న్నారు. పార్ల‌మెంటు భ‌వ‌న స‌ముదాయంలా సెంట్ర‌ల్ హాల్ ను నిర్మిస్తామ‌ని.. శాస‌న‌సభ‌.. మండ‌లి ఉంటాయ‌ని.. ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ భ‌వ‌నాన్ని వీలైన‌న్ని రోజులు య‌థాత‌ధంగా ఉంచుతామ‌న్నారు. ఏదో చేస్తామ‌ని ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్న వేళ‌.. కేసీఆర్ న‌మ్మ‌కాల కోసం రూ.500 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేయ‌టాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటార్లే అని అనుకందామా?