Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'గెలుపు' లో ఆరు మిస్‌!

By:  Tupaki Desk   |   12 Dec 2018 5:12 AM GMT
కేసీఆర్ గెలుపు లో ఆరు మిస్‌!
X
కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ ఆరు. కీల‌క నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు ఆయ‌న ఆరును క‌చ్ఛితంగా మిస్ కాకుండా చూసుకుంటారు. డేట్ విష‌యంలో కానీ.. ముహుర్తం విష‌యంలోనూ ఆరును ఆయ‌న అస్స‌లు విడిచిపెట్ట‌రు. అదేం చిత్ర‌మో కానీ.. కొన్నిసార్లు ఆయ‌న సాధించే సీట్లు ఆరు చుట్టూనే తిరుగుతాయి. కానీ.. ఈసారి ఆయ‌న ఘ‌న విజ‌యంలో ఆరు అస్స‌లు క‌నిపించ‌లేదు.

కేసీఆర్ ఆరు సెంటిమెంట్ ను ఉటంకిస్తూ సోష‌ల్ మీడియాలో కొన్ని పోస్టులు వైర‌ల్ అయ్యాయి. అయితే.. అవ‌న్నీ అంకెల మాయాజాల‌మే త‌ప్పించి మ‌రింకేమీ కాదు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ గెలుచుకున్న స్థానాలు 88. ఈ రెండు అంకెల్ని క‌లిపిన‌ప్పుడు 16 వ‌స్తుంది. దీన్ని 1+6గా కూడితే చివ‌రికి వ‌చ్చేది "7".

ఫ‌లితాలు వెల్ల‌డైన రోజు 11-12-18గా చూసినా.. 11-12-2018 రెండింటిని అన్ని అంకెల్ని క‌లిపితే ఆరు అంకె రాదు. మొద‌టిదాన్ని చూస్తే.. 5 వ‌స్తే.. రెండో దాని అంకెల్ని క‌లిపితే చివ‌ర‌కు వ‌చ్చేది ఏడు. ఇలా ఏ కాంబినేష‌న్లోనూ ఆరు క‌నిపించ‌దు. ఇదిలా ఉంటే కొంద‌రు కేసీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం ఈ రోజు (బుధ‌వారం) ఉంటుంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. అదేమీ లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న ప్రెస్ మీట్‌లో తేల్చి చెప్పారు.

టీఆర్ఎస్ సీఎల్పీ స‌మావేశం బుధ‌వారం మ‌ధ్యాహ్నం జ‌రుగుతుంద‌ని.. పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హోదాలో కేకే అద్భుత‌మైన విందును ఏర్పాటు చేస్తార‌ని.. మీడియా మొత్తాన్ని ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తామ‌ని చెప్పారు. నోరూరించే విందుకు తెలంగాణ భ‌వ‌న్ వేదిక అవుతుంద‌ని.. కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో క‌లిసి మీడ‌యాకు విందు ఇవ్వ‌నున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు. పార్టీ స‌మావేశం.. విందు కార్య‌క్ర‌మం అంటే సాయంత్రం వ‌ర‌కూ సాగే ప‌రిస్థితి.

సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సి వ‌స్తే.. దాదాపుగా ఉద‌య‌మే ఉంటుంది. అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న మాట‌ల‌తోనే తేల్చి చెప్పారు. దీంతో.. ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం బుధ‌వారం లేన‌ట్లే. ఒక‌వేళ ఊహించ‌ని విధంగా ముహుర్తాలు ఫోర్సు చేసి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప‌క్షంలో ఒక కాంబినేష‌న్లో ఆరు వ‌స్తుందే త‌ప్పించి మ‌రో కాంబినేష‌న్లో ఆరు రాని ప‌రిస్థితి.

ఒక‌వేళ కొంద‌రు ఊహించిన‌ట్లుగా బుధ‌వారం (12-12-18) కానీ ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే మాత్రం టోట‌ల్ ఆరు వ‌చ్చే ప‌రిస్థితి. కానీ.. ఎవ‌రైనా తేదీని లెక్క వేసేట‌ప్పుడు 12-12-2018గా లెక్క వేస్తారే కానీ.. 12-12-18గా లెక్కించ‌రు. ఇక‌.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసే తేదీల్లో కాస్త మంచిగా క‌నిపిస్తోన్న‌ది.. ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ది 14-12-2018 మాత్ర‌మే. ఈ అంకెల్ని మొత్తంగా కూడితే 2 వ‌స్తుంది. తాజా ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ 51,514 ఓట్ల మెజార్టీతో త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఒంటేరు ప్ర‌తాప‌రెడ్డిపై విజ‌యం సాధించారు. ఈ అంకెల మొత్తాన్ని కూడినా 7 అంకె వ‌స్తుంది. ఇలా.. ఏ కాంబినేష‌న్లో చూసినా కేసీఆర్‌ కు అచ్చి వ‌చ్చే ఆరు క‌నిపించ‌ట్లేదు.