Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ ఎఫెక్ట్‌!...33కి తెలంగాణ జిల్లాలు!

By:  Tupaki Desk   |   3 Jan 2019 3:08 PM GMT
సెంటిమెంట్ ఎఫెక్ట్‌!...33కి తెలంగాణ జిల్లాలు!
X
తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు టీఆర్ ఎస్ అధినేత ఏకంగా 14 ఏళ్ల పాటు ఉద్యమం కొనసాగించారు. కేసీఆర్ ఉద్య‌మ స్ఫూర్తి - తెలంగాణ ప్ర‌జ‌ల క‌ద‌న కుతూహ‌లం కార‌ణంగా 2014లో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించింది. ఆ వెంట‌నే జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ తొట్ట తొలి ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో పాటు కేసీఆర్‌ ను త‌మ తొలి సీఎంగా చేసుకున్నారు. అంతే... త‌న‌దైన శైలి సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసిన కేసీఆర్‌... 10 జిల్లాల‌తో ఏర్పాటైన తెలంగాణ‌ను 31 జిల్లాలున్న రాష్ట్రంగా మార్చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా కూడా కేసీఆర్ సింగిల్ స్టెప్ కూడా వెన‌క్కు వేయ‌లేద‌నే చెప్పాలి. ఎవ‌రేమ‌నుకున్నా... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయ‌డం ద్వారా రాష్ట్రంలో సుప‌రిపాల‌న సాధ్య‌మ‌న్న మాట చెప్పిన కేసీఆర్... తాను అనుకున్న‌ట్లుగానే తెలంగాణ‌ను 31 జిల్లాల రాష్ట్రంగా మార్చేశారు.

పాల‌న‌లో ఎలా ఉన్నా... కేసీఆర్‌ కు సెంటిమెంట్ పిచ్చి బాగా ఎక్కువే క‌దా. ప్ర‌తి విష‌యంలోనూ ముహూర్తాలు - రాశులు - తిథి న‌క్ష‌త్రాలు చూసుకుని అడుగు ముందుకేసే కేసీఆర్‌.... తెలంగాణ‌లో జిల్లా సంఖ్య *ఆరు* వ‌చ్చేలా ఉండాల్సిందేన‌ని త‌ల‌చార‌ట‌. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంథించి గ‌తంలో చేప‌ట్టిన క‌స‌ర‌త్తులు కేసీఆర్ అంచ‌నాను అందుకోలేదు. ఈలోగా తెలంగాణ అసెంబ్లీకి రెండో ద‌ఫా ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. ఈ ఎన్నిక‌లకు కూడా త‌న సెంటిమెంట్‌ను జోడించిన కేసీఆర్‌... త‌న‌కు అనుకూలంగా, త‌న సెంటిమెంట్ ఎంతమాత్రం త‌ప్ప‌కుండా చూసుకుని ఏకంగా ఇంకా తొమ్మిదేళ్ల పాటు పాల‌న సాగించే అవ‌కాశం ఉన్నా కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ - పోలింగ్ - కౌంటింగ్ కూడా తాను అనుకున్న తేదీల్లోనే జ‌రిగేలా చూసుకున్నార‌న్న విశ్లేష‌ణ‌లు కూడా మ‌న‌కు తెలిసిందే. తాను అనుకున్న ప్ర‌కార‌మే ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా... కేసీఆర్ బంప‌ర్ విక్ట‌రీ సాధించేశారు. గ‌తంలో కంటే మెరుగైన సంఖ్య‌లో సీట్ల‌ను సాధించిన కేసీఆర్‌... విప‌క్షాల‌న్నింటికీ భారీ దెబ్బ కొట్టేశారు.

ఈ క్ర‌మంలో త‌న‌కు తిరుగు లేద‌న్న స్థాయిలో పాల‌న‌ను ప‌ట్టాలెక్కించేసిన కేసీఆర్‌... ఇప్పుడు జిల్లాల సంఖ్య‌ను త‌న సెంటిమెంట్‌కు అనుగుణంగా మార్చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టిదాకా ఉన్న‌31 జిల్లాల‌కు అద‌నంగా మ‌రో రెండు జిల్లాల‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే ఇక‌పై తెలంగాణ‌లో మొత్తం 33 జిల్లాలుంటాయ‌న్న మాట‌. ఈ సంఖ్య‌లోని రెండు మూడుల‌ను క‌లిపితే *ఆరు* వ‌స్తుంది క‌దా. అలా కేసీఆర్ త‌న సెంటిమెంట్‌ ను సాకారం చేసుకుంటున్నార‌న్న మాట‌. ఈ మేర‌కు రెండు కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్‌ ను విడుద‌ల చేసిన కేసీఆర్ స‌ర్కారు.. ప్ర‌జ‌ల అభ్యంత‌రాల‌కు 30 రోజుల గ‌డువు ఇస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. ఇక కొత్త‌గా ఏర్పాటు కానున్న జిల్లాల విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టిదాకా భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ములుగు ఓ కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. ఈ జిల్లా కింద‌కు ములుగు - వెంక‌టాపూర్‌ - గోవింద‌రావుపేట‌ - తాడ్వాయి - ఏటూరునాగారం - క‌న్నాయిగూడెం - మంగ‌పేట‌ - వెంక‌టాపురం - వాజేడు త‌దిత‌ర తొమ్మిది మండ‌లాల‌ను చేరుస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... మ‌రో కొత్త జిల్లాగా నారాయ‌ణ్‌ పేట్‌ ను ప్ర‌క‌టించింది. ఇప్ప‌టిదాకా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కింద ఉన్న నారాయ‌ణ్ పేట‌ను... దామ‌ర‌గిద్ద‌ - ధ‌న్వాడ‌ - కోసిగి - క్రిష్ణ‌ - మ‌ద్దూరు - మ‌క్త‌ల్‌ - మ‌రిక‌ల్‌ - నారాయ‌ణ్ పేట్‌ - న‌ర్వా - ఊటుకూరు త‌దిత‌ర 12 మండ‌లాల‌తో కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయ‌నుంది.