Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భ‌యం

By:  Tupaki Desk   |   14 Feb 2022 10:53 AM GMT
టీఆర్ఎస్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో భ‌యం
X
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేస్తున్నారు. ఇప్ప‌టికే యుద్ధం ప్ర‌క‌టించి తీవ్ర విమ‌ర్శ‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ మండిప‌డ్డారు.

ధ‌ర్మం గురించి మాట్లాడే బీజేపీ.. ఇలా చేయ‌డం ధ‌ర్మ‌మా? అని ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ దివంగ‌త నాయ‌కులు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై బీజేపీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కేసీఆర్ తిప్పికొట్టారు. మోడీని టార్గెట్ చేసిన ఆయ‌న‌.. బీజేపీని ఇర‌కాటంలో పెట్టేందుకు ఇప్పుడు రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా మాట్లాడారు. దీంతో టీఆర్ఎస్‌లోని కొంత‌మంది ఎమ్మెల్యేల్లో కొత్త టెన్ష‌న్ పుట్టుకొచ్చింద‌నే టాక్ వినిపిస్తోంది.

2018లో తెలంగాణ‌లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండోసారి అధికారంలో వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్ ఉండ‌దేమోన‌నే భ‌యంతో ఆ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. త‌మ రాజకీయ భ‌విష్య‌త్ కోసం వాళ్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

కానీ ఇప్పుడు వాళ్ల ప‌రిస్థితి ఆందోళ‌న‌గా మారింది. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా కేసీఆర్ మాట్లాడ‌టమే వాళ్ల భ‌యానికి కార‌ణ‌మైంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా కేసీఆర్ వ్యాఖ్య‌లు ఉండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయ‌నే ప్ర‌చారం జోరందుకుంది. బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్ర‌స్తావిస్తోంది. మ‌రోవైపు టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశం లేద‌ని తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ కేంద్రంలోని బీజేపీకి వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు చేసే ప్రయ‌త్నాలు చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. అవ‌స‌ర‌మైతే కాంగ్రెస్ సాయం కూడా తీసుకునే వీలుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంది. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొత్త భ‌యం ప‌ట్టుకుంది.

ఒక‌వేళ వ‌చ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే త‌మ‌కు టికెట్లు ద‌క్క‌వ‌ని ఈ 12 మంది ఎమ్మెల్యేలు టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లే అవ‌కాశం కూడా వాళ్ల‌కు లేద‌ని అంటున్నారు.

ఇలా రెండు మార్గాలు మూసుకుపోయి భ‌విష్య‌త్ ఉండ‌దని ఆ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా ఈ ఎమ్మెల్యేల ప‌నితీరుపై కేసీఆర్ ఆగ్ర‌హంతో ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. వాళ్ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వ‌డం కష్ట‌మేన‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.