Begin typing your search above and press return to search.

సారు సీరియస్.. సమ్మెపై ఫైనల్ వార్నింగ్!

By:  Tupaki Desk   |   5 Oct 2019 5:26 AM GMT
సారు సీరియస్.. సమ్మెపై ఫైనల్ వార్నింగ్!
X
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వచ్చింది. తన ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ ను అధికారంలో ఉన్న ఆయన మర్చిపోయినట్లున్నారు. కాలం.. సందర్భంతో సంబంధం లేకుండా తాను అనుకున్నట్లుగా ఉద్యమ పిలుపులతో తాను ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన వైనాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా అంతే.. అన్నట్లుగా ఆయన తీరు ఉంది.

ఉద్యమాలు ఊరికే పుట్టుకురావని.. సమ్మెలు.. ఆందోళనలు ఉత్తనే ఎవరూ చేయరని.. కడుపు కాలినప్పుడు.. గుండె మండినప్పుడు.. భారీగా నష్టపోతున్నప్పుడు మాత్రమే ఆందోళనలు చేస్తారంటూ గతంలో తాను చెప్పిన మాటల్ని మర్చిపోయిన ఉద్యమ నేత.. తాను కోరుకున్నట్లు వ్యవహరించిన ఆర్టీసీ యూనియన్లపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. సాయంత్రం ఆరు గంటల లోపు డ్యూటీలో చేరితే ఉద్యోగం.. లేదంటే ఉద్యోగంలో నుంచి తీసేయటమే అంటూ భారీ నిర్ణయాన్ని తీసేసుకున్నారు.

సమ్మె చట్టానికి అనుగుణంగా ఆర్టీసీ నడుచుకోవాలే తప్పించి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చేశారు. బతుకమ్మ.. దసరా వేళలో సంస్థ నాలుగు రూపాయిలు సంపాదించుకునే అవకాశాన్ని పక్కన పెట్టి.. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయటం ఏమిటన్న అసహనాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్.. సమ్మె అంటూ జరిగితే కఠినంగానే వ్యవహరించాలని.. క్రమశిక్షణ కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

డెడ్ లైన్ గా శనివారం సాయంత్రం ఆరుగంటల సమయాన్ని ప్రకటించిన కేసీఆర్.. ఆ లోపు డ్యూటీ ఉన్న వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తిచాలని.. లేని పక్షంలో తమకు తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ఆదేశించారు. విధుల్లో చేరిన వారిని.. బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికుల్ని పూర్తిస్థాయిలో రక్షణ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దన్న మార్గదర్శనం చేశారు.

ప్రజల అసౌకర్యాన్ని తగ్గించేలా ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి.. జిల్లాల నుంచి అద్దె బస్సుల్ని తెప్పించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్.. కార్మిక సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపకూడదని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అంతేకాదు.. కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ గా సందీప్ సుల్తానియాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యమాల బాసటతో ఇంత ఎత్తుకు ఎదిగిన కేసీఆర్.. అదే తరహాలో తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెపై ఇంత కర్కశంగా వ్యవహరించటమా? అన్నదిప్పుడు ప్రశ్న.