Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ వేదిక‌గా నిర‌స‌నకు చెక్ పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   8 July 2017 5:54 AM GMT
ఫాంహౌస్ వేదిక‌గా నిర‌స‌నకు చెక్ పెట్టిన కేసీఆర్
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు త‌న వ్య‌వ‌సాయ క్షేత్రం అంటే ఎంత మ‌క్కువో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అవ‌కాశం దొరికితే చాలు ఫాంహౌస్‌ కు వెళ్లిపోయి త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌వ‌సాయ‌పనుల్లో ఆయ‌న నిమగ్న‌మైపోతారు. అయితే తాజాగా ఆ ట్రెండ్ కాస్త మారిన‌ట్లు క‌నిపిస్తోంది. ఫాంహౌస్ వేదిక‌గా కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం సైతం కేసీఆర్‌ చూపుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ త‌ల‌పెట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టు కోసం భూముల సేక‌ర‌ణ విష‌యంలో గ‌త కొద్దికాలంగా నిర‌స‌న‌లు ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో తాజాగా త‌న ఫాంహౌస్‌ లో ఈ ఆందోళ‌న‌కు కేసీఆర్ చెక్ పెట్టిన‌ట్లు స‌మాచారం.

కొండ పోచ‌మ్మ‌ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న మామిడ్యాల, బైలంపూర్, తానేదార్‌పల్లి తండా గ్రామాల రైతులతో తన ఫాంహౌస్‌లోసీఎం కేసీఆర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు సీఎంకు, ప్రజలకు మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారంతో పాటు, వారి ఆర్థిక ఉన్నతికి కూడా పలు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని స‌మాచారం. భూములు కోల్పోతున్న తమకు బతుకుదెరువు కనాకష్టంగా మారే పరిస్థితి ఉత్పన్నమవుతుందని దానికి తగినట్లుగా సహాయం అందించాలని రైతులు కోరగా సీఎం స్పందిస్తూ ఎవరికీ నష్టం జరగకుండా పరిహారం చెల్లిస్తామని తెలిపారు. భూనిర్వాసితులకు వారు కోరుకున్న చోట త‌న ద‌త్త‌త గ్రామ‌మైన‌ ఎర్రవల్లిలో కట్టించినట్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్‌ వాగ్దానం చేశారు. అంతే కాకుండా రైతులకు ఆదాయాన్ని మరింత పెంచేందుకు ప్రతి ఇంటికీ పాడి పశువులు, మేకలు, కోళ్లు వంటివి కూడా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్న భరోసా ఇ చ్చారు.

ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలనే లక్షంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని, రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ కోరినట్లు సమావేశానంతరం రైతులు తెలియజేశారు. భూనిర్వాసితులకు అన్ని విధాలుగా తాను, తన ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరో ఏదో చెబితే నమ్మవద్దని చెప్పారని వారు అన్నారు. రైతులందరూ కలిసి ఆలోచించుకున్న తదుపరి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని తాను మరో మూడు రోజుల్లో స్వయంగా ముంపు గ్రామాలను సందర్శిస్తానని, అప్పుడే రైతులతో మరోమారు చర్చ లు జరుపుతానని చెప్పారని తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన ముఖాముఖి చర్చలు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని సహచర రైతులతో మాట్లాడి సీఎం రాగానే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని రైతులు తెలిపారు.