Begin typing your search above and press return to search.

మళ్లీ గవర్నర్ కు షాకిచ్చిన కేసీఆర్.. బడ్జెట్ మీటింగ్స్ షురూ

By:  Tupaki Desk   |   20 Jan 2023 7:15 AM GMT
మళ్లీ గవర్నర్ కు షాకిచ్చిన కేసీఆర్.. బడ్జెట్ మీటింగ్స్ షురూ
X
రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య విభేధాలు తారాస్థాయికి చేరాయి. ఏడాదిన్నర కిందట మొదలైన ఈ వివాదం మరింత ముదిరింది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా కొనసాగించనున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. అయితే కొందరు అధికారులు చెబుతున్న ప్రకారం ఈసారి కూడా అసెంబ్లీ ప్రోరోగ్ చేయడం లేదని, గత బడ్జెడ్ సమావేశాలకు కొనసాగింపుగానే ఉంటాయని తెలిపారు.ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు కూడా తెలపనున్నట్లు పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ మరోసారి తమిళ సై లేకుండా అసెంబ్లీ సమావేశాలు రన్ చేయనున్నారు. అయితే కేసీఆర్ ఈ సమావేశాలు ఏ ప్రకారంగా నిర్వహిస్తున్నారు..? అనేది తెలుసుకుందాం..

బడ్జెట్ సమావేశాల ప్రారంభ సమయంలో గవర్నర్ ప్రసంగం ఉండడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. కానీ బీజేపతో ఉన్న వివాదం కారణంగా ఆ పార్టీకి చెందిన గవర్నర్ తమిళ సైని పట్టించుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం ప్రతీ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించాలి. అలాగే ప్రతీ క్యాలెండర్ ఇయర్ తొలి సెషన్ ను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రతీ క్యాలెండ్ ఇయర్ ప్రసంగించాలనంటే అసెంబ్లీ ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోరోగ్ చేయడం లేదు.

2021 సెప్టెంబర్ 27న మొదలైన అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే మళ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ప్రోరోగ్ చేయకుండా వాటిని రెండో 8వ సెషన్ గా నోటిఫై చేశారు.

ఇప్పటి వరకు మూడుసార్లు అలా సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు మార్చిలో వాటిని నాలుగో సిట్టింగ్ గా పేర్కొంటూ సమావేశాలు కొనసాగించే అవకాశం ఉంది. అసెంబ్లీని ప్రోరోగ్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ ప్రోరోగ్ చేసిన తరువాత తిరిగి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అయితే కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

గణతంత్ర వేడుకలను సైతం కేసీఆర్ గవర్నర్ ను కాదని నిర్వహించే అవకాశం ఉంది. కొవిడ్ రాకముందు గణతంత్ర వేడుకలను పబ్లిక్ గార్డెన్లో నిర్వహించేవారు. కానీ కొవిడ్ తరువాత నిబంధనల పేరుతో ఈ వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేశారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులను ఆహ్వానించినా ఎవరూ రాజ్ భవన్ కు వెళ్లలేదు. అయితే ఈసారి కొవిడ్ పరిస్థితులు లేనందున వీటిని ఎలా నిర్వహించాలని అధికారులు తలమునకలవుతున్నారు.

ఏడాదిన్నర కింద మొదలైన కేసీఆర్, తమిళ్ సైల మధ్య వివాదం.. పలు సందర్బాల్లో రచ్చకెక్కింది. మేడారం జాతర సందర్భంగా గవర్నర్ కు ప్రత్యేక హెలీక్యాప్టర్ ఇవ్వలేదు. దీంతో గవర్నర్ రోడ్డు మార్గం ద్వారానే వెళ్లారు. అయితే ఇటీవల రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఒకే వేదికపై కనిపించారు. కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి గవర్నర్ ప్రసంగం లేకుండా సాగుతుందనడంపై ఈ వివాదం ఇంకా సమసిపోలేదని అర్థమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.