Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజకీయం ఇలానే ఉంటుంది.. బడా నేతలు బస్టాండేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:51 AM GMT
కేసీఆర్ రాజకీయం ఇలానే ఉంటుంది.. బడా నేతలు బస్టాండేనా?
X
కేసీఆర్ ఎత్తులు ప్రత్యర్థుల వరకు ఎందుకు.. సొంత పార్టీలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సైతం అంచనా వేయలేని విధంగా ఉంటాయని చెబుతారు. అందరూ ఆలోచించినట్లే కనిపిస్తూనే.. అందరి ఆలోచలనకు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటం ఆయనకు అలవాటేనని చెబుతారు. దీనికి తగ్గట్లే ఆయన నిర్ణయాలు ఉంటాయని చెప్పక తప్పదు. తాజాగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టటం ఈ కోవలోకే చెందుతుంది. ఇదే సమయంలో.. ఆయనకు కాస్త అటు ఇటుగా పార్టీలోకి వచ్చిన ఎల్. రమణ.. పెద్ది రెడ్డిలాంటి వారి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

టీఆర్ఎస్ లో మొదట్నించి బయట నుంచి వచ్చే వారి విషయంలో విచిత్రమైన లెక్కలు కనిపిస్తాయి. బాగా పేరున్న నేత పార్టీలోకి వచ్చే టైంలో.. ఆయనకు హైప్ క్రియేట్ చేయటం.. ఆయనకు పదవి ఇవ్వటం తమను తాము గౌరవించుకోవటం లాంటిదంటూ మనసు దోచే మాటలు కేసీఆర్ నోటి నుంచి వస్తుంటాయి. మాటల వరకే ఇవన్నీ అన్నట్లుగా ఆయన చేతలు తర్వాత ఉంటాయి. ఎక్కడి దాకానో ఎందుకు? డి.శ్రీనివాస్ సంగతే తీసుకుంటే.. కేసీఆర్ మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం ఉంటుందన్నది ఇట్టే అర్థమవుతుంది.

తాజాగా ఎల్ రమణ.. పెద్దిరెడ్డి లాంటి వారి పరిస్థితి ఇప్పుడేంటి? అన్నది ప్రశ్న. రమణ సంగతి కాసేపు పక్కన పెడితే.. అప్పుడెప్పుడో తాను మంత్రిగా చేశాను కాబట్టి.. తనకున్న ప్రజాదరణ.. బలం గురించి ఎక్కువగా ఊహించుకుంటారని చెబుతారు. ప్రజల్లో తనకంత పట్టు ఉంటే.. ఎన్నికల్లో గెలిచి ఉండేవారు కదా? ఇప్పుడు ఆయన అలాంటి ఆలోచన చేయటానికి కూడా ఇష్టపడరు. అలాంటి పెద్ద రెడ్డి.. తన గురించి చాలా ఎక్కువగా ఆలోచించుకుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆయన మాటలు ఇదే అర్థం వచ్చేలా ఉంటాయన్నది మర్చిపోకూడదు.

ఇలాంటి వారిని ఎలా డీల్ చేయాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు కూడా. మరో కీలకమైన అంశం ఏమంటే.. టీఆర్ఎస్ లోకి వచ్చే వరకు అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నేతలంతా.. ఆ తర్వాత గులాబీ చెట్టు నీడలో బతికేయాల్సిందే కానీ.. పార్టీ ఇమేజ్ కు అతీతంగా తమ ఇమేజ్ ను బిల్డ్ చేసుకునే అవకాశం ఉండదు. అందుకే గులాబీ పార్టీలోకి వెళ్లిన నేతలు ఎవరైనా సరే.. వ్యక్తిగతంగా వారి ఇమేజ్ పెరిగేది ఉండదన్నట్లుగా చెప్పాలి.

ఇప్పుడు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టేందుకు రెఢీ అయిన కేసీఆర్.. సీనియర్లు అయిన ఎల్. రమణ.. పెద్దిరెడ్డి..వారిని ఏం చేస్తాన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల అంచనా ప్రకారం.. వారిద్దరికి ఇప్పట్లో పదవులు లభించే అవకాశం లేదని.. ఒకవేళ లభించినా రమణకు ఏదైనా పోస్టు ఇస్తారు కానీ.. పెద్దిరెడ్డికి మాత్రం ఇప్పట్లో అవకాశం లేదని చెబుతున్నారు. సామాజిక సమీకరణాల్ని చూసినా.. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గమైన కౌశిక్ కు ఎమ్మెల్సీ కట్టబెట్టిన నేపథ్యంలో.. మరో రెడ్డికి పదవిని ఇవ్వటం కుదరదు. మొత్తంగా పదవుల కోసం ఆరాటపడే పెద్దిరెడ్డికి టీఆర్ఎస్ లోనూ నిరాశ తప్పదన్న మాట వినిపిస్తోంది.