Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణయం ఉద్యోగులకు కరెంటు షాకేనా?

By:  Tupaki Desk   |   7 Oct 2016 5:35 AM GMT
కేసీఆర్ నిర్ణయం ఉద్యోగులకు కరెంటు షాకేనా?
X
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని తనకు తగ్గట్లుగా మార్చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి తగ్గట్లుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ సందు సందులోనూ తన మార్క్ స్పష్టంగా కనిపించాలన్న తపన ఉన్న కేసీఆర్.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాలు మరో నాలుగు రోజుల్లో తెర మీదకు వస్తున్న వేళ.. పాలనా పరమైన అంశాల మీద ఆయన దృష్టి పెట్టారు.

అన్ని జిల్లాల్లో పాలన యూనిఫాం మాదిరి ఒకేలా ఉండకూడ‌దన్న సరికొత్త సూత్రాన్ని తెర మీదకు తీసుకొచ్చిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే శాఖల అధికారుల పేర్లను కూడా మార్చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా రెవెన్యూ విభాగంలో ఇప్పటికే వ్యవహరిస్తున్న పదవులకు భిన్నమైన పేర్లను ఆయన తెర మీదకు తీసుకొచ్చారు.ఇప్పటి వరకూ జరిగింది పక్కన పెడితే.. ఇకపై మాత్రం తాను చెప్పినట్లుగా జరగాలని చెబుతున్న కేసీఆర్ మాటల్ని చూస్తే.. అన్నింటా మార్పు స్పష్టంగా కనిపించాలన్న ముఖ్యమంత్రి తపన స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.

రెవెన్యూ విభాగానికి సంబంధించి కొన్నిచోట్ల కొన్ని రకాలుగా పిలుస్తున్నారని.. ఇకపై అధికారిని వారి కేడర్ తో సంబంధం లేకుండా జిల్లా అధికారి హోదా కల్పించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వస్తున్న అన్ని జిల్లాలకు కేడర్ అధికారుల్ని నియమిస్తే.. బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది మరి. అందుకే.. కేడర్ తో సంబంధం లేకుండా హోదాల్ని చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు.

ఈ విధానంలో మండల రెవెన్యూ అధికారిని తహసీల్దార్ అని పిలవాల్సి ఉంటుంది. డిప్యూటీ ఎమ్మార్వోను నాయబ్ తహసీల్దార్ అని పిలవాలి. ఇక.. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ను గిర్దావర్ అని వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక.. ఉద్యోగులను వారి వృత్తి స్వభావానికి తగ్గట్లు ఏ బాధ్యతలకైనా.. ఏ ప్రాంతానికైనా బదిలీ చేసే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. అధికారుల్ని ప్రభుత్వం ఏ పనికైనా.. ఏ హోదాకైనా వాడుకునే వీలు రానుంది. మరి ఈ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయన్నది ఒక ప్రశ్న.

శాఖలతో సంబంధం లేకుండా ఎప్పుడు ఏ అవసరం పడుతుందో.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగుల పని తీరు ఉండాలే తప్పించి..ఫలానా పని మాత్రమే చేస్తామన్నట్లుగా అధికారులు ఉండకూడదన్నట్లుగా చెబుతున్న కేసీఆర్ మాట ఉద్యోగులకు పెద్ద షాకే ఇస్తుందని చెప్పక తప్పదు. తన రాజ్యంలో ఎక్కడ చూసినా తాను మాత్రమే కనిపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్న కేసీఆర్ తీరు ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడు పడకపోవటానికే ఎక్కువ అవకాశం ఉందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/