Begin typing your search above and press return to search.

సారుకు నోబెల్ ప్రైజ్ ఎందుకివ్వాలో చెప్పాడు!

By:  Tupaki Desk   |   18 July 2019 5:01 AM GMT
సారుకు నోబెల్ ప్రైజ్ ఎందుకివ్వాలో చెప్పాడు!
X
అర్థమైన‌ట్లే ఉండి అర్థంకాన‌ట్లుగా ఉండ‌టం కొంద‌రిలో క‌నిపిస్తూ ఉంటుంది. ఆ కోవ‌కే చెందుతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అంతా అర్థ‌మైన‌ట్లుగా.. చ‌దివిన పుస్త‌కంలా క‌నిపించే కేసీఆర్‌.. అంత‌లోనే కొత్త పుస్త‌కంలా క‌నిపిస్తారు. ఆయ‌న గురించి తెలుసుకున్నోళ్ల‌కు తెలుసుకున్నంత కొత్త విష‌యాలు తెలుస్తుంటాయి. అలాంటి వారికి కూడా రాని ఐడియా ఒక పెద్ద మ‌నిషికి మ‌స్తు వ‌చ్చింది.

కేసీఆర్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు రీ డిజైనింగ్ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టివ‌ర‌కూ చాలామంది చాలాగా పొగిడారు కానీ.. ఎప్ప‌టికి నిలిచిపోయే రీతిలో ఒక్క‌రు కూడా పొగిడింది లేదు. ఆ కొర‌త‌ను తీర్చేశారు జ‌ల‌శ‌క్తి అభియాన్ కేంద్ర క‌మిటీ జాయింట్ సెక్ర‌ట‌రీ బిపిన్ చంద్ర‌. తాజాగా ఆయ‌న కేసీఆర్ ను ఉద్దేశించి మా గొప్ప మాట చెప్పేశారు. తెలుగు ప్ర‌జ‌ల‌కు తేర‌గా దొరికారు కాబ‌ట్టి సారు గొప్ప‌త‌నం తెలీయ‌ట్లేదు కానీ.. సారు ఆలోచ‌న‌ల్ని లోతుగా ప‌రిశీలిస్తే.. ఆయ‌నెంత ముందుచూపుతో ప్లాన్ చేస్తార‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌పంచం చూసిన రెండు ప్ర‌పంచ యుద్ధాలు దేనికోస‌మైనా.. జ‌రిగే మూడో ప్ర‌పంచ యుద్ధం మాత్రం నీటి కోస‌మేన‌ని చెప్పేటోళ్లు కొంద‌రు ఉంటారు. అలాంటి వాళ్ల‌లోనే బిపిన్ మాష్టారు. ఫ్యూచ‌ర్లో నీటి కోసం జ‌రిగే యుద్ధాల్ని ముందుచూపుతో గుర్తించి.. అలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వీలుగా సారు చేప‌ట్టిన ప్రాజెక్టు కాళేశ్వ‌రం. దూర‌దృష్టితో వ్య‌వ‌హ‌రించి తెలంగాణ జాతిని యుద్ధాల బారిన ప‌డ‌కుండా చేసిన మేధావికి గుర్తింపుగా.. చంద్రునికో నూలుపోగు చందంగా నోబెల్ బ‌హుమ‌తి ఇవ్వాలంటూ బిపిన్ సారు విన్న‌వించుకున్నారు.

అదే ప‌నిగా ప‌ద‌వులు తీసుకోవ‌ట‌మే కానీ.. కృత‌జ్ఞ‌త‌గా బిపిన్ బాస్ మాదిరి ఇన్నోవేటివ్ గా సారు గొప్ప‌త‌నాన్ని అంద‌రికి తెలిసేలా చేయ‌ని టీఆర్ ఎస్ నేత‌ల్ని ఏం చేయాలంటారు? స‌ర్లే.. జ‌రిగిందేదో జ‌రిగింది.. ఇక‌నైనా బిపిన్ మాష్టారిని ఫాలో కండి.