Begin typing your search above and press return to search.

అలీ మాట‌!... కేసీఆర్‌ కు నోబెల్ ఇవ్వాలి!

By:  Tupaki Desk   |   27 Oct 2017 4:35 AM GMT
అలీ మాట‌!... కేసీఆర్‌ కు నోబెల్ ఇవ్వాలి!
X
పార్టీ అధినేత‌ల‌పై ఆ పార్టీ నాయ‌కులు చేసే కామెంట్స్ కొన్నిసార్లు చిత్ర‌విచిత్రంగానూ - మ‌రికొన్ని సార్లు ఎంతో ఆస‌క్తికరంగానూ ఉంటాయి! త‌మ స్వామి భ‌క్తిని నిరూపించుకోవ‌డానికో.. లేక నిజంగానో తెలియ‌దుగాని వారు చేసే వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్యంలో ముంచేస్తుంటాయి!! పొగ‌డ్త‌.. ప్ర‌శంస‌.. శ్లాఘించ‌డం.. వంటి స్థాయి వ‌ర‌కూ ప‌ర్లేదు గానీ.. అది దాటిపోతే మాత్రం కొంత ఎబ్బెట్టుగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు!! ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై.. తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి ముహమ‌ద్ అలీ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ సంభ్ర‌మాశ్చ‌ర్యంలో ముంచేస్తున్నాయి. కేసీఆర్‌కు దేశంలోనే అత్యున్న‌త‌మైన బిరుదు భార‌త‌ర‌త్న ఇచ్చినా స‌రిపోద‌ని.. ప్ర‌పంచంలో ఉన్న‌త పుర‌స్కారం నోబెల్ ఇవ్వాల‌ని కోర‌డం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది.

తెలంగాణ సాధించిన నాయ‌కుడిగా కేసీఆర్‌ కు తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఎంతో ఆరాధ్య‌భావం ఉంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం! ఎంతోమంది తెలంగాణ ఉద్య‌మంలో స‌మిధ‌లుగా మారినా.. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా ఆయ‌న పేరు గుర్తుండిపోతుంది. అయితే ప్ర‌స్తుతం తెలంగాణ ఆటో డ్రైవ‌ర్స్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ(టీఏడీజేఏసీ) ఆధ్వ‌ర్యంలో సీఎం కేసీఆర్‌ కు శాంతి దూత బిరుదును ప్ర‌దానం చేశారు. ర‌వీంద్ర భార‌తి క‌ళాక్షేత్రంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కేసీఆర్ త‌ర‌ఫున ఆ అవార్డును తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌హ‌ముద్ అలీ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు శాంతిదూత బిరుదు - భారతరత్న ఇలా ఏది ఇచ్చినా తక్కువేనని, పద్నాలుగేళ్లు ఎక్కడా రక్తం చుక్క చిందకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టారని మహమూద్ అలీ అన్నారు. అలాంటి మహాత్ముడికి నోబెల్‌ శాంతి పురస్కారం ఇవ్వాలన్నారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని - సంతృప్తికర సేవలను అందిస్తే సమాజంలో గుర్తింపు - గౌరవం దక్కుతాయన్నారు.