Begin typing your search above and press return to search.

గవర్నర్ కు కేసీఆర్ ప్రివ్యూ షో చూపించారు

By:  Tupaki Desk   |   3 Oct 2015 4:21 AM GMT
గవర్నర్ కు కేసీఆర్ ప్రివ్యూ షో చూపించారు
X
భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి అనుసరించని విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనుండటం తెలిసిందే. జల విధానానికి సంబంధించి తమ సర్కారు చేయబోయే పనుల గురించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని భావించటం.. దీనికి గవర్నర్ నరసింహన్ ను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించటం తెలిసిందే. అంతేకాదు.. ఈ ప్రజంటేషన్ కు శాసన సభ్యులతో పాటు.. శాసన మండలి సభ్యులతో కూడిన ఉభయ సభల్ని ఒక చోటకు చేర్చి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ఒక అంశం మీద ఉభయ సభల్ని సమావేశ పరవటం లాంటివి ఉమ్మడి రాష్ట్రంలోనూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

అయితే.. తాను ఇవ్వనున్న ప్రజంటేషన్ గురించి చర్చించటమే కాదు.. దాన్ని ఇప్పటికే గవర్నర్ కు చూపించారు. తాము చూపించే ఇరిగేషన్ సినిమా సంచలనం సృష్టించటం ఖాయమన్న మాటను గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీలో చూపించాల్సిన సినిమాకు ముందే.. గవర్నర్ వద్ద ప్రత్యేక ప్రివ్యూ షో వేశారు. శుక్రవారం దాదాపు నాలుగు గంటలకు పైనే సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజంటేషన్ చూపించటమే ఇంత సమయం తీసుకోవటానికి కారణంగా చెబుతున్నారు.

ఈ నెల 8 లేదంటే 9 తేదీన ఇచ్చే ప్రజంటేషన్ ద్వారా ఇరిగేషన్ విషయంలో తెలంగాణ సర్కారు ఏం చేయాలని అనుకుంటోందని.. ఏం చేస్తుంది? తన వాదన ఏమిటి? తాను ఏం కోరుకుంటుందన్న విషయాన్ని చెబుతుందని చెబుతున్నారు. అంతేకాడు.. వివిధ నదుల్లోతమ వాటా గురించి కూడా వాదన వినిపిస్తుంది. ఇక.. ప్రాజెక్టుల రీ డిజైన్ కు సంబంధించిన అంశాలు కూడా ఇందులో ఉండనున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని వివరించటంతో పాటు.. ప్రాజెక్టుల నత్తనడక తీరును కూడా ప్రస్తావించనున్నారు. ఇక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలహారంతో పాటు.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీటిని అందించే అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఇక.. ఎగువ రాష్ట్రాల జలదోపిడీ మీద కూడా ప్రభుత్వం తన వాదనను వినిపిస్తుందని తెలుస్తోంది. తెలంగాణ ఇరిగేషన్ ప్రణాళిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? దానికి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి? అందుకు తామేం చేయాలన్న విషయాల్ని వివరంగా ప్రజంటేషన్ లో ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ప్రదర్శించిన ప్రజంటేషన్ గవర్నర్ ను విపరీతంగా ఆకట్టుకుందని.. కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రశంసించారని చెబుతున్నారు. గవర్నర్ మనసు దోచుకున్న ప్రజంటేషన్.. తెలంగాణ రాజకీయ పక్షాల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.