Begin typing your search above and press return to search.

ఎల్ బీ స్టేడియంలో కేసీఆర్ స‌భ ర‌ద్దు.. జ‌నం లేక‌నేనా?

By:  Tupaki Desk   |   30 March 2019 4:51 AM GMT
ఎల్ బీ స్టేడియంలో కేసీఆర్ స‌భ ర‌ద్దు.. జ‌నం లేక‌నేనా?
X
ఎన్నిక‌ల వేళ‌ అధికార పార్టీ స‌భ నిర్వ‌హిస్తుందంటే.. ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముందు ఏమున్నా.. లేకున్నా.. జ‌న స‌మీక‌ర‌ణ మీద నేత‌లు ఫోక‌స్ చేస్తుంటారు. ఏమైందో ఏమో కానీ.. తాజాగా హైద‌రాబాద్ న‌డి బొడ్డున ఉన్న ఎల్ బీ స్టేడియంలో టీఆర్ ఎస్ ఏర్పాటు చేసిన స‌భ‌కు జ‌నం రాక‌పోవ‌టం షాకింగ్ గా మారింది.

శుక్ర‌వారం రాతి ఎల్ బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స‌భ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ రావాలి. కానీ.. ఆయ‌న రాలేదు. దీనికి కార‌ణం స‌భ‌కు జ‌నం రాక‌పోవ‌ట‌మేన‌ని తెలుస్తోంది. దాదాపు 60 నుంచి 70 వేల మంది సామ‌ర్థ్యం ఉన్న ఎల్ బీ స్టేడియంలో ఐదు వేల మంది కూడా రాక‌పోవ‌టంతో.. నిఘా వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారంతో కేసీఆర్ స‌భ‌కు రాలేదు.

అనివార్య కారణాల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌భ‌కు రాలేక‌పోతున్నార‌ని ప్ర‌క‌టిస్తూ.. స‌భ‌ను ముగించేశారు గులాబీ నేత‌లు. హైద‌రాబాద్‌.. సికింద్రాబాద్‌.. మ‌ల్కాజిగిరి.. చేవెళ్ల ఎంపీ స్థానాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌తో ఏర్పాటు చేసిన స‌భ‌ను భారీగా నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. త‌క్కువ‌లో త‌క్కువ 50 వేల మందికి త‌క్కువ కాకుండా జ‌న‌సమీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని డిసైడ్ చేశారు. అయితే.. ప్లానింగ్ లోపం కార‌ణంగా జ‌నాన్ని తీసుకొచ్చే విష‌యంలో నేత‌లు ఫెయిల్ అయ్యారు.

గులాబీ నేత‌ల్లో మితిమీరిన ఆత్మ‌విశ్వాసంతో పాటు.. రాజుగారి బిందెలో పాలు పోసే చందంగా.. వాళ్లు తెస్తార్లే అని వీళ్లు.. వీళ్లు తెస్తార్లే అని వాళ్లు.. ఇలా ఎవ‌రికి వారు అనుకోవ‌టం.. ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించుకోక‌పోవ‌టంతో జ‌నం రాలేద‌ని తెలుస్తోంది. స్టేడియంలో ఐదు వేల మంది కూడా లేర‌న్న విష‌యం తెలుసుకున్న కేసీఆర్‌.. స‌భ‌కు రాలేన‌ని స్ప‌ష్టం చేయ‌టంతోనే టీఆర్ ఎస్ నేత‌లు సభ‌ను ముగించిన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. ఎన్నిక‌ల వేళ సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యే స‌భ‌కు జ‌నం రాక‌పోవ‌టం టీఆర్ఎస్ నేత‌ల‌కు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.