Begin typing your search above and press return to search.

పాల‌న వ‌దిలి.. ఈ పార్టీలు చేసుడేంది సారూ?

By:  Tupaki Desk   |   2 July 2019 5:23 AM GMT
పాల‌న వ‌దిలి.. ఈ పార్టీలు చేసుడేంది సారూ?
X
అప్పుడెప్పుడో కొన్నేళ్ల క్రితం కృష్ణ వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నిన్నే పెళ్లాడుతా సినిమా గుర్తుందా? అందులోని పాత్ర‌ల‌న్ని ఎప్పుడూ ఎంజాయ్ చేయ‌ట‌మే క‌నిపిస్తుంది. మాట వ‌ర‌స‌కు కూడా స‌మ‌స్య‌ల‌న్న‌వి ఉన్న‌ట్లు చూపించ‌రు. ప‌ని చేయ‌టం కూడా క‌నిపించ‌దు. ఎంత‌సేప‌టికి విందులు.. వినోదాల‌న్న‌ట్లుగా సాగే ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ టైంలో విమ‌ర్శ‌కులు ప‌లువురు ఈ త‌ర‌హా సినిమాను త‌ప్పు ప‌ట్టారు. చేదుమాత్ర‌కు షుగ‌ర్ కోటెడ్ మాదిరి ఉంద‌ని.. ఇలాంటి సినిమాల‌తో జీవితం మీద దృక్ఫ‌దం మారుతుంద‌న్న మాట వినిపించింది. క‌ట్ చేస్తే.. ఇన్నేళ్ల త‌ర్వాత కృష్ణ‌వంశీ సినిమాకు త‌గ్గ‌ట్లే.. కేసీఆర్ పాల‌న ఉంద‌ని చెబుతున్నారు.

చేతిలో ఉన్న అధికారాన్ని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే క‌న్నా.. త‌ర‌చూ ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌టం.. ప్ర‌జ‌ల్ని ఆ మ‌త్తులో ముంచేయ‌టం త‌ప్పించి మ‌రో ఆలోచ‌న లేద‌న్న‌ట్లుగా ఉంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. మొత్తంగా కేసీఆర్ స‌ర్కారు ఒక ఈవెంట్ సంస్థ‌లా మారింద‌ని.. కేసీఆర్ ఈవెంట్ మేనేజ‌ర్ మాదిరి మారార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

దీనికి త‌గ్గ‌ట్లే తెలంగాణ‌లో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల్ని చూస్తే.. అధికారులు ఆగ్ర‌హంగా ఉంటే.. విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోవ‌టం క‌నిపిస్తుంది. ఇక‌.. సొంత పార్టీ నేత‌ల్లోనూ ఆవేద‌న‌. సారు ద‌ర్శ‌నం కోసం త‌పిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అయినా.. సారు మాట కోసం.. పిలుపు కోసం తపిస్తున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఓప‌క్క ఆదివాసీలు.. మ‌రోప‌క్క టీఆర్ ఎస్ నేత‌ల ఆగ‌డాలు.. మ‌రోవైపు దందాలు.. దోపిడీలు.. ఇలా తెలంగాణ రాష్ట్రం ఉంద‌న్న విమ‌ర్శ ఉంది.

వీటికి అద‌నంగా అసెంబ్లీ.. సచివాల‌యం నిర్మాణాల కోసం భారీ ఎత్తున ప్లాన్లు వేస్తున్న వైనంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు చుట్టూ స‌మ‌స్య‌ల్ని పెట్టుకొని.. దేనికి ప‌రిష్కార మార్గం వెత‌క్కుండా పాలిస్తున్నార‌న్న ఆరోప‌ణ కేసీఆర్ మీద వినిపిస్తోంది. త‌ర‌చూ ఏదో ఒక కొత్త ప్రోగ్రాంను తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే త‌ప్పించి.. షురూ చేసిన కార్య‌క్ర‌మాల్ని ఎంచ‌క్కా క్లోజ్ చేయ‌టం అన్న‌దే క‌నిపించ‌ద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

పాలించ‌మ‌ని.. తెలంగాణ‌ను బంగారం చేయాలంటూ ఏరికోరి అధికారాన్ని చేతికి ఇస్తే.. చేసేది ఇదేనా కేసీఆర్? అన్న ఆగ్ర‌హం ప‌లు వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది. నిన్న‌టికి నిన్న కేసీఆర్ కు జిగిరీ దోస్త్ గ‌వ‌ర్నర్ న‌రసింహ‌న్ స‌మీక్ష నిర్వ‌హించిన విద్యా స‌మీక్ష‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు మొద‌లుకొని.. ఉన్న‌త విద్యా మండ‌లి ఒక్క‌టంటే ఒక్క పోస్టును భ‌ర్తీ చేయ‌లేద‌ని న‌ర‌సింహ‌న్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే.

ఇలా చుట్టూ స‌మ‌స్య‌ల్ని పెట్టుకున్న కేసీఆర్‌.. వాటిని వ‌దిలేసి.. విందులు ఏర్పాటు చేయ‌టంలో బిజీ కావ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. తాజాగా త‌న సొంతూరైన చింత‌మ‌డ‌క‌లో గ్రామ ప్ర‌జ‌ల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం జ‌రిపే దిశ‌గా కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రామ ప్ర‌జ‌ల‌తో స‌వ‌ధానంగా ముఖాముఖి నిర్వ‌హించ‌టం ఈ కార్య‌క్ర‌మం ముఖ్యోద్దేశంగా చెబుతున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌.. బంధువులు.. చిన్న‌నాటి స్నేహితులు.. వారి కుటుంబ స‌భ్యులంతా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. సీఎం అయ్యాక త‌న సొంతూరుకు కేసీఆర్ వెళుతున్న‌ది ఇదే తొలిసారి. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో చింత‌మ‌డ‌క‌కు ఓటేసేందుకు వెళ్లిన కేసీఆర్ ఆ త‌ర్వాత మ‌ళ్లీ మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ గ్రామానికి వ‌చ్చి వెళ్లారు. అది మిన‌హా స్థానికుల‌తో మాట్లాడింది లేదు.

ఈ నేప‌థ్యంలో ఒక రోజంతా గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఉండేందుకు వీలుగా ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల‌లోనే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికుల‌తో ముచ్చ‌ట్ల‌తో పాటు.. భారీ విందు ఇచ్చేలా సీఎం కేసీఆర్ ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు. సీఎంగా మారిన త‌ర్వాత గ‌తంలో మాదిరి కేసీఆర్ త‌మ‌తో ఉండ‌టం లేద‌న్న అసంతృప్తి చింత‌మ‌డ‌క వాసుల్లో వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో.. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకే తాజా కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు. స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న కోరుకునే ప్ర‌జ‌ల ఆశ‌ల్ని కూడా ఇదే రీతిలో తీరిస్తే స‌రిపోతుందిగా సారూ?