Begin typing your search above and press return to search.

తలసానిని పక్కన పెట్టుకొని ఏక్ నాథ్ షిండ్ గురించి మాట్లాడటమా?

By:  Tupaki Desk   |   12 July 2022 4:28 AM GMT
తలసానిని పక్కన పెట్టుకొని ఏక్ నాథ్ షిండ్ గురించి మాట్లాడటమా?
X
నీతులు చెప్పేందుకే అన్న మాటకు తగ్గట్లే ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్ని చూస్తుంటే. విలువల్ని బోధించేందుకే పుట్టినట్లుగా క్లాసులు పీకే సీఎం కేసీఆర్.. మందికి చెప్పే బుద్ధులు.. తన వరకు తానేం చేశానన్న విషయాన్ని ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల సీఎం కుర్చీలో కూర్చున్న ఏక్ నాథ్ షిండేను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆయన్ను వేలెత్తి చూపించే ముందు.. కేసీఆర్ తనకు తానుగా చేసిందేమిటన్న విషయాన్ని గుర్తు చేసుకోరా? అన్న సందేహం కలుగక మానదు.

నీతులు.. విలువల గురిమంచి మాట్లాడే కేసీఆర్.. తొలిసారి తాను గెలిచినప్పుడు.. మంత్రివర్గ విస్తరణను పెట్టుకొని.. పార్టీ నుంచి బయటకు రాని తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకోవటం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ మాటకు వస్తే.. 2014 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్.. టీడీపీ తరఫున ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలను ఆయా పార్టీల నుంచి బయటకు తీసుకొచ్చి గులాబీ కారులో కూర్చోబెట్టటం తెలిసిందే. ఉద్యమం వేళ.. చెప్పిన నీతులకు.. ఎన్నికల అనంతరం చేసి చేతలకు ఏ మాత్రం పొంతన లేని విషయం తెలిసిందే.

ఏక్ నాథ్ షిండే విలువల గురించి మాట్లాడటానికి ముందు.. తామేం చేశామన్న విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ అధినేతకు ఉండదా? అన్నది ప్రశ్న.

తాను చేసే పనిని సమర్థించుకునే ఆయన.. ఏక్ నాథ్ షిండేలా లాంటి వారిని తప్పు పట్టటం.. దానికి మోడీని సీన్లోకి లాగటం తెలిసిందే. ఇలాంటివి ప్రశ్నించాలని సీఎం కేసీఆర్ బలంగా భావిస్తే.. దానికంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా తాను చేసిందేమిటన్న విషయాన్ని చరిత్ర తరచూ క్వశ్చన్ చేస్తూనే ఉంటుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు.

ప్రెస్ మీట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పక్కన కూర్చోబెట్టుకొని ఎక్కడో ఉన్న ఏక్ నాథ్ షిండేను.. ఢిల్లీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యను చేయటానికి ముందు.. తానేం చేశానన్న సోయి కేసీఆర్ కు ఉండి ఉంటే.. ఆయన నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు వచ్చేవి కాదన్నది మర్చిపోకూడదన్న మాట వినిపిస్తోంది. నీతులు చెప్పటానికి ముందు.. దానికి తగ్గ అర్హత తనకుందా? అన్న ప్రశ్న కనీసం కూడా వేసుకోని స్థితిలో కేసీఆర్ ఉన్నారన్న విషయం తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతుందంటున్నారు.

ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన ఆయన.. ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో చెప్పే మాటలకు చేసే పనులకు మధ్య ఉన్న దూరాన్ని అందరూ గమనిస్తారన్న విషయాన్ని ఆయన ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని లేని పక్షంలో ఆయన కలలు కల్లలు కావటమే కాదు.. చాలానే ప్రశ్నలకు సమాధానాలు ఆయన చెప్పాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.