Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్లో అదిరేలా మాటలు చెప్పే కేసీఆర్.. ఈ నిజాన్ని ఎప్పటికి తెలుసుకుంటారు?

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:55 AM GMT
ప్రెస్ మీట్లో అదిరేలా మాటలు చెప్పే కేసీఆర్.. ఈ నిజాన్ని ఎప్పటికి తెలుసుకుంటారు?
X
ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు? తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి.. మీడియా ప్రతినిధులు తాము అడగాల్సిన అంశాలు అడిగితే.. తిరిగి చెప్పటం ద్వారా తాను చెప్పే విషయం మీద మరింత స్పష్టత.. అంతకు మించి అసలేం జరుగుతుందన్న ఫీడ్ బ్యాక్ పాత్రికేయుల నుంచి తెలుసుకోవటం అత్యున్నత స్థానాల్లో ఉండే వారి మొదలు సాదాసీదా నేతల వరకు చేస్తుంటారు. ఈ విధానాన్ని మరోలా అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసినప్పుడు.

ప్రెస్ మీట్ పెట్టింది తాను అడ్డదిడ్డంగా మాట్లాడుతూ.. తాను కత్తి కట్టిన వారిపై తాను విసిరే విసుర్లను వింటూ.. వీలైతే అస్వాదిస్తూ.. తాను అనే బూతుల్ని.. ఆవేదనగా.. అంతకు మించిన ఆక్రోశంగా ఫీల్ అవుతూ.. మారు మాట్లాడకుండా.. ఒకవేళ మాట్లాడితే.. తాను చెప్పిన మాటలకు కొనసాగింపుగా.. తాను మరింత ఆవేశానికి గురై తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేందుకు సాయంగా ఉండాలన్నట్లుగా ఉంటుంది కేసీఆర్ తీరు చూస్తే.

అంతే తప్పించి.. ఆయన ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపిన వెంటనే ఆగ్రహానికి గురి కావటం.. ఎవరు చెప్పారండి? మీకు ఎలా తెలుసండి? మీరేంమాట్లాడుతున్నారో మీకు తెలుసా అండి? ఈ సొల్లు మాటలేందండి? ఇలానా మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? అంటూ ఒకింత గౌరవాన్నిపలికిస్తూ మండిపడే కేసీఆర్ మాటలు చిన్నబుచ్చులే.. గాయపరిచేలా..

అందరి ముందు అవమానపడేలా ఉంటాయి. అయినప్పటికీ పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తూ.. ఆయన చేత మాటలు పడుతూనే పని చేస్తున్నారు జర్నలిస్టులు. ఇదంతా ఎందుకంటే.. ప్రెస్ మీట్ సందర్బంగా ఆయన తీరును చూస్తే.. పాత్రికేయుల్ని బుల్ డోజ్ చేసి పారేసేలా ఉంటుంది.

ఎవరైనా ఆయన స్పీడ్ కు అడ్డుపడితే.. ఆవేశంతో ఏమైనా అనేందుకు ఆయన వెనుకాడని పరిస్థితి. ప్రెస్ మీట్ లో ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు.. ఇలాంటి ప్రభుత్వం మరో పాతికేళ్లు ఉండాలన్న భావన కలిగేలా చేస్తుంది. ఏదో తెలీని ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని.. భారీ ఎత్తున సాగుతున్న ఈ ప్రకియతో రైతులు చాలా ఖుషీగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతారు. ఇలాంటివేళ.. అసలు వాస్తవం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు.. ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు స్వయంగా భువనగిరి వెళ్లాడు.

అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. యాదాద్రి జిల్లాలకు చెందిన ఒక రైతు ఆవేదన చూస్తే.. ధాన్యాన్ని పండించిన రైతులు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. తాను ప్రభుత్వం ఇచ్చిన విత్తులే వేశామని.. ఇప్పుడేమో తేమ అంతుంది.. ఇంతుందని అంటున్నారని వాపోయాడు.

గత ఏడాది ఈ సమస్య లేదని.. ఈసారి మాత్రం బస్తాకు మూడు..నాలుగు కేజీల తరుగు తీసేస్తే తామేం కావాలని వాపోయాడు. కుప్పలు పోసిరెండు నెలలైందని.. పలుకుబడి ఉన్నోళ్ల ధాన్యాన్ని తీసుకుంటున్నారని.. తమలాంటి చిన్నోళ్లను పట్టించుకోవటం లేదంటున్నారు. వాళ్లకు లేని తరుగు తమకెందుకు వస్తోందని? అడిగిన ఆ రైతు మాటల్ని విన్నప్పుడు.. ప్రెస్ మీట్ లో గంభీరంగా చెప్పే ముఖ్యమంత్రి మాటలకు.. వాస్తవానికి మధ్య అంతరం ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

ఏదైనా ఇష్యూ మీద పాత్రికేయులు మాట్లాడితే.. వారిని అడ్డదిడ్డం మాటలతో ఆపే సీఎం కేసీఆర్..ఈ తరహా బుల్ డోజింగ్ తో ఆయన సాధించేది ఏమీ లేదన్న విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే.. పాత్రికేయులు నోరు విప్పి మాట్లాడితే.. వాస్తవాలు బయటకువస్తాయి. వారి మాటల్ని ఫీడ్ బ్యాక్ గా తీసుకోవాలి. వాటిని అధికారులతో క్రాస్ చెక్ చేయాలి. అంతే కానీ.. ఎవరుచెప్పారు?ఊరుకోవయ్యా.. ఇవేనా మీ మాటలు? అంటూ విరుచుకుపడటంతో మౌనంగా ఉండొచ్చు. కానీ.. వాస్తవం మాత్రం ఏదోరూపంలో బయటకు వచ్చి.. ప్రభుత్వం బద్నాం అవుతుందన్న సత్యాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో?