Begin typing your search above and press return to search.

ఇవాంకకు కేసీఆర్ దావ‌త్‌....మోడీ ఫిదా

By:  Tupaki Desk   |   17 Nov 2017 6:49 AM GMT
ఇవాంకకు కేసీఆర్ దావ‌త్‌....మోడీ ఫిదా
X
హైద‌రాబాద్ వార్త‌ల‌న్నీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ చుట్టూనే తిరుగుతున్నాయి. కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం కావ‌చ్చు లేదా ఆమెకు ద‌క్కుతున్న ప్ర‌త్యేక గౌర‌వం అయి ఉండ‌వ‌చ్చు కానీ ఇవాంక పేరు మీడియాలో మారుమోగిపోతోంది. హైదరాబాద్‌ లో ఈ నెలాఖరులో జరుగనున్న గ్లోబల్ ఎంటర్‌ ప్రెన్యూర్స్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఇవాంక ట్రంప్ ట్వీట్ చేయ‌డం దీనికి మ‌రింత ఊపునిచ్చింది. ఈ స‌ద‌స్సు 28వ తేదీన జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆరోజే ఇవాంక రానున్నార‌ని భావించారు. అయితే...అంతర్జాతీయ పారిశ్రామిక ఔత్సాహిక సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 26నే హైదరాబాద్ చేరుకోనున్నారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని భద్రతా అధికారులు గోప్యంగా ఉంచారు.

ఈ సదస్సును ఈ నెల 28వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే సదస్సు ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇవాంక నగరానికి చేరుకుంటారని విశ్వసనీయ సమాచారం. 26 -27 తేదీల్లో మహిళా పారిశ్రామిక వేత్తలతోనూ - భారతీయ పారిశ్రామిక వేత్తలతోనూ సమావేశం కావడంతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రాచీన సంస్కృతి - వారసత్వాలకు కాణాచిగా ఉన్న భవనాలు - చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. 26నే ఎఆర్ రహ్మన్ నిర్వహించే మ్యూజికల్ ఫెస్టుకు ఆమె హాజరవుతారు. 28వ తేదీన ప్లీనరీ కార్యక్రమం 7 గంటలు ముగుస్తుంది. అనంతరం భారత ప్రధాని నరేంద్రమోడీ ఇవాంక బృందానికి ఫలక్‌ నుమా ప్యాలెస్‌ లో విందు ఏర్పాటు చేస్తున్నారు. 29వ తేదీ రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాంక బృందంతో పాటు పలువురు భారతీయ పారిశ్రామిక వేత్తలకు గోల్కొండ ఫోర్టులో విందు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పాలకుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా లైట్ అండ్ సౌండ్ అలంకరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది. కీలక సదస్సులు - సహ సదస్సులు - ఇతర కార్యక్రమాలు హేటెక్స్‌ లో జరుగుతాయి.

కాగా, అమెరికా నుండి 400 మంది ప్రతినిధులు - భారత్ నుండి 400 మంది - మిగిలిన అన్ని దేశాల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతారు. దాంతో పోలీసులు గోల్కొండ ఫోర్టును - ఫలక్‌ నుమా ప్యాలెస్‌ ను - హేటెక్స్‌ ను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండు రోజుల ముందు నుండే ఈ ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా నిషేధ ఆజ్ఞలు అమలుచేయనున్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్తలతో పాటు ప్రముఖ తారలు కూడా హాజరవుతారని తెలిసింది. ప్రముఖ సినీనటి శిల్పాశెట్టి - జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్ల కూడా హాజరవుతారు. ప్రఖ్యాతి గాంచిన వంద స్టార్టప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. స్టార్టప్‌ ల ఆలోచన, అవి ఎదిగిన క్రమం - క్రమానుగత సవాళ్లు - పరిష్కారాలు కూడా ఈ సందర్భంగా వివరిస్తారు. విజయవంతమైన స్టార్టప్‌ లను చూసి అదే తరహా కొత్త స్టార్టప్‌లను రూపొందించేందుకు వీలుంటుందని చెబుతున్నారు. హైపర్‌ లూప్ - ఇండియా ఎడ్జ్ - సాగూన్ - సోషల్ కాప్స్ - స్పేసెక్స్ - టెస్లా తదితర సంస్థలు స్టార్టప్‌ లను ప్రదర్శిస్తాయి.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాంక ట్రంప్ 28వ తేదీన హైదరాబాద్ చేరుకోవాలి, అయితే రెండు రోజులు ముందుగానే హైదరాబాద్ వస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఇవాంక ట్రంప్ నేరుగా శంషాబాద్ ఎయిర్‌ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. ఆమెతో పాటు అక్కడి నుండి 400 మంది పారిశ్రామిక వేత్తలు - 50 మంది సిబ్బంది - 10 మంది సహాయకులు కూడా రానున్నట్టు తెలిసింది. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఆమె అవుటర్ రింగ్‌ రోడ్ మీదుగా హైటెక్ సిటీ మైండ్‌ స్పేస్‌ లోని వెస్టిన్ హోటల్‌ కు చేరుకుంటారు. చార్మినార్ - లాడ్ బజార్‌ లలో ఇవాంక షాపింగ్ చేసేందుకు వీలుగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.