Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్లైట్ అద్దె రూ.2కోట్లు

By:  Tupaki Desk   |   8 Sep 2015 4:18 AM GMT
కేసీఆర్ ఫ్లైట్ అద్దె రూ.2కోట్లు
X
తరచూ విదేశీ పర్యటనలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భిన్నంగా కాస్త తక్కువగా ఫారిన్ ట్రిప్పులు వేస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా ఆయన వారం రోజుల చైనా పర్యటనకు సోమవారం బయలుదేరి.. చైనాలో ల్యాండ్ అయ్యారు. ఆయన వెంటనే భారీ బృందమే బయలుదేరింది. దాదాపు నలభై మంది కేసీఆర్ వెంట ఉన్నారు.

ఈ కారణంతో కావొచ్చు ఆయన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లున్నారు. యాభై సీట్లున్న బొండార్డియర్ ఎయిర్ క్రాఫ్ట్ ను అద్దెకు తీసుకున్నారు. చైనా పర్యటనలో సదరు ఎయిర్ క్రాఫ్ట్ ఆయన వెంట ఉండనుంది. ఈ విమానం అద్దె కోసం తెలంగాణ సర్కారు రూ.2కోట్లు ఖర్చు చేయనుంది. విమానం అద్దెకే ఇంత మొత్తం అంటే.. మిగిలిన ఖర్చులు భారీగానే ఉండనున్నాయి. మరింత ఖర్చు చేసి మరీ చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కో చైనా పర్యటన లక్ష్యం కూడా పెద్దగా ఉన్నట్లే. చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ తనతో పాటు పలువురు నేతలు.. అధికారులు.. పారిశ్రామికవేత్తల్ని తీసుకెళ్లారు.

తన తాజా పర్యటన ద్వారా రూ.50వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని భావిస్తున్నారు. విభజన తర్వాత ఏర్పడిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీన పెట్టుబడుల సమీకరణపై దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు చైనా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తల్ని కలవనున్నారు.

‘‘న్యూ చాంఫియన్స్’’ పేరిట జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో మాట్లాడటంతో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. కేసీఆర్ చైనా పర్యటనలో భాగంగా డాలియన్.. షాంఘై.. బీజింగ్.. షెంజాన్.. హాంకాంగ్ లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు.. ఎన్ ఆర్ ఐలు.. పలువురు నాయకులు.. దౌత్యవేత్తలతో చర్చలు జరపనున్నారు. క్షణం తీరిక లేకుండా వరుస సమావేశాల్లో పాల్గొననున్న కేసీఆర్.. తెలంగాణకు ఏం తీసుకొస్తారో చూడాలి.