Begin typing your search above and press return to search.

400 కోట్ల‌తో..ఇంకో వ‌ర్గాన్ని ఖుష్ చేసిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   27 Feb 2018 3:34 PM GMT
400 కోట్ల‌తో..ఇంకో వ‌ర్గాన్ని ఖుష్ చేసిన కేసీఆర్‌
X
తెలంగాణ ప్ర‌గ‌తి యాత్ర పేరుతో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా త‌న వ‌రాల జ‌ల్లును కొన‌సాగిస్తున్నారు. ఈ విడ‌త టూర్‌ లో మొద‌ట‌గా రైతు కుటుంబాల‌కు తీపిక‌బురు తెలిపిన సంగ‌తి తెలిసిందే. రైతులు అనారోగ్యానికి గురైనా - అకాల మరణం చెందినా ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత బీమా వర్తించే విధంగా రైతు బీమా పథకాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు తెలంగాణ సీఎం ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని - ఈ వేదికపై నుంచే అర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ కు చెప్తున్నాన‌ని వివ‌రించారు. ఇదే వ‌రుస‌లో తాజాగా మ‌రోవ‌ర్గానికి తీపి క‌బురు తెలిపారు. సింగ‌రేణిలో ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.400 కోట్లు కేటాయిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నస్పూర్‌ లోని షిర్కే కాలనీలో సింగరేణి క్వార్టర్లను పరిశీలించారు. కార్మికుల సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మణుగూరు ఏరియాలో కొండపురం - రాంపూర్ షాప్ట్‌ బ్యాక్ - కేకే-6 ఇంక్లెయిన్ - కాశిపేట-2 ఇంక్లెయిన్ - జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీకే-3 - 5 ఇంక్లెయిన్లకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీరాంపూర్‌ లో సింగరేణి కార్మికుల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. కేంద్రప్రభుత్వం దేశంలోని బొగ్గుగనులను ప్రైవేటీకరిస్తానంటుంది - ఆరునూరైనా సింగరేణిని ప్రైవేటీకరించేది లేదని పునరుద్ఘాటించారు. ప్రాణం పోయినా సరే సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. విద్యుత్ ప్లాంట్లను జెన్కోనే ఏర్పాటు చేస్తుందని సీఎం అన్నారు. సింగరేణి కార్మికుల కోసం దశలవారిగా 10 వేల క్వార్టర్స్ నిర్మిస్తామన్నారు. కొత్త క్వార్టర్ల నిర్మాణానికి యాజమాన్యం రూ.400 కోట్లు ఇస్తుంద‌ని తీపిక‌బురు తెలిపారు. సింగరేణి కార్మికులకు రేపటి నుంచి కరెంట్ - వాటర్ బిల్లు ఉండదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్న కార్మికుల ఇళ్ల‌ పట్టాలు ఇస్తామ‌ని మ‌రో తీపిక‌బురు అందించారు.

దీంతోపాటుగా మ‌రిన్ని వ‌ర్గాల‌కు తీపిక‌బురు అందించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం పేర్కొనారు. మరోమారు పార్లమెంట్‌ లో ఆదాయపన్ను మినహాయింపును కోరుతామ‌ని తెలిపారు. రిటైర్డు కార్మికులకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కార్మికులతోపాటు వారి తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నామ‌ని వివ‌రించారు. 10 లక్షలలోపు ఇంటి రుణానికి వడ్డీ మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రంజాన్ - క్రిస్మస్ పండుగలకు వేతనంతో కూడిన సెలవు ఉంటుందన్నారు. మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నం. కారుణ్య నియామకాల్లో అందరికీ అవకాశం వస్తుంద‌న్నారు. అలియాస్‌ తో పేరు ఉన్నవారికి యాజమాన్యం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాదని సీఎం స్పష్టం చేశారు.