Begin typing your search above and press return to search.

తెలంగాణ‌కు కొత్త హోదా ఇచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   19 March 2018 5:31 AM GMT
తెలంగాణ‌కు కొత్త హోదా ఇచ్చిన కేసీఆర్
X
ఉగాది సంద‌ర్భంగా నిర్వ‌హించే పంచాంగ శ్ర‌వ‌ణ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. తెలంగాణ రాష్ట్రానికి ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చూడ‌ని కోణంలో చూసి.. కొత్త హోదాను క‌ట్ట‌బెట్టారు కేసీఆర్‌. తెలంగాణ‌ను దేవ రాష్ట్రంగా ఆయన అభివ‌ర్ణించారు. దేశంలో మ‌రెక్క‌డా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మ‌తాలు.. కులాల వారి పూజ‌లు అద్భుతంగా జ‌రుగుతుంటాయ‌ని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం దేవ రాష్ట్ర‌మ‌ని.. మ‌సీదుల్లో కావొచ్చు.. చ‌ర్చిల్లో.. గుడుల్లో ఎక్క‌డైనా స‌రే అద్భుతంగా పూజ‌లు జ‌రుగుతాయ‌న్నారు. మౌజీమ్ లు.. ఇమామ్ లు.. పూజారుల‌కు ఏ రాష్ట్రంలో ఇవ్వ‌నంత వేత‌నాల్ని ఇస్తున్న‌ట్లు చెప్పారు. అన్ని పండ‌గ‌ల్ని స‌మానంగా చూస్తున్న‌ది తెలంగాణ‌లో మాత్ర‌మేన‌ని ఒక పెద్దాయ‌న త‌న‌కీ రోజు ఉద‌యం చెప్పిన‌ట్లుగా కేసీఆర్ చెప్పారు.

అంద‌రిని స‌మానంగా చూసే సంస్కారం తెలంగాణ‌కు మాత్ర‌మే ఉంద‌న్న ఆయ‌న‌.. త‌న గొప్ప‌త‌న‌మ‌ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఈ తెలివే కేసీఆర్ ను మిగిలిన నేత‌ల‌కు భిన్నంగా ఉంచుతుంద‌ని చెప్పాలి. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని.. భ‌గ‌వంతుడు నియ‌మించిన కార్య‌క‌ర్త‌లుగా య‌థాశ‌క్తి కృషి చేయాల‌న్న కేసీఆర్‌.. అన్ని సంవ‌త్స‌రాల మాదిరే ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్ర‌జానీకానికి శుభం జ‌ర‌గాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

పంచాంగ‌క‌ర్త‌లు త‌మ పంచాంగ ప‌ఠ‌నంలో తెలంగాణ రాష్ట్రానికి రాజ్య‌పూజ్యం 7.. అవ‌మానం 3 అని చెప్పార‌ని.. ఆదాయం 8.. వ్య‌యం 2 అని చెప్పార‌ని.. అంటే తెలంగాణ క‌చ్ఛితంగా స‌ర్ ప్ల‌స్ బ‌డ్జెట్ రాష్ట్రంగా ఉంటుంద‌న్నారు. ఇది చాలా సంతోష‌క‌ర‌మైన విష‌య‌మ‌ని.. రాష్ట్రానికి ఢోకా లేద‌ని.. సుసంప‌న్న మిగులు రాష్ట్రంగా ఉంటుంద‌న్నారు.

దేశంలో ఏడెనిమిది స్వ‌యం స‌మృద్ధ రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టిగా చెప్పిన కేసీఆర్.. ఎవ‌రైతే స‌మృద్ధంగా లేరో వారికి స‌హాయాన్ని అందించే స్థితిలో తెలంగాణ ఉంద‌ని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ త‌న‌కు తాను ఎదుగుతూ దేశాభివృద్ధి ప్ర‌క్రియ‌లో భాగ‌స్వామి అవుతుంద‌ని ప్ర‌ధాని మోడీతో తాను ఒక‌సారి చెప్పిన‌ట్లుగా చెప్పారు.

మ‌న ఆదాయంతో మ‌న‌ల్ని మ‌నం పోషించుకుంటున్నాం.. దేశాన్ని ముందుకు తీసుకుపోవ‌టంలో తెలంగాణ‌ది కీల‌క‌పాత్ర‌గా చెప్పారు. కేంద్రానికి తెలంగాణ రూ.50వేల కోట్లు ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి వ‌స్తున్న‌ది రూ.24 వేల‌ కోట్లు మాత్ర‌మేన‌ని.. అయినా ఆ ఆదాయంతో మ‌న‌ల్ని మ‌నం పోషించుకుంటూ వ‌స్తున్నామ‌ని కేసీఆర్ చెప్పారు. నాలుగైదు రాష్ట్రాల‌కు సాయం చేసే స్థితిలో ఉన్నామ‌ని చెప్పే కేసీఆర్‌.. ఏదో రాష్ట్రానికి సాయం చేసే క‌న్నా.. తెలంగాణ రాష్ట్రంలో బ‌తికే దిగువ‌.. మ‌ధ్య‌త‌ర‌గతి జీవుల‌కు ఊర‌ట‌నిచ్చేలా ప్లాన్ చేయొచ్చుగా..?