Begin typing your search above and press return to search.

తెలంగాణకు ఉన్నదిక ఒకే సమస్యనా కేసీఆర్?

By:  Tupaki Desk   |   8 April 2016 9:41 AM GMT
తెలంగాణకు ఉన్నదిక ఒకే సమస్యనా కేసీఆర్?
X
ఉగాదిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. పండితుల ప్రవచనాల తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రెండు సమస్యలు తీరిపోయాయని.. ఇక మిగిలింది ఒకే సమస్యగా ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణలోని నిధులన్నీ వందశాతం తెలంగాణ ప్రాంతానికే ఖర్చు అవుతాయని.. ఆ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఇక.. నియమకాల విషయంలోనూ ఆలోచించాల్సిన అవసరం లేదని.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నిరాదరణకు గురైనా.. ఇకపై అలాంటిది జరగదని.. తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న గంటా చక్రపాణి నూరుశాతం తెలంగాణ బిడ్డ అని.. తెలంగాణ వారికే ఉద్యోగాలు వస్తాయన్నారు.

ఇక.. తెలంగాణకు మిగిలింది ఒకే ఒక్క సమస్య అని.. అది నీళ్ల సమస్యగా చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం తాను ఏడాది నుంచి కసరత్తు చేస్తున్నానని.. సరైన విధానాన్ని గుర్తించేందుకు చాలా సందర్భాల్లో అర్ధరాత్రి తర్వాత కూడా మధనం చేశామని.. అందులో భాగంగానే గోదావరి నీళ్లను తెలంగాణకు తీసుకురావాలన్న పాయింట్ తీసుకొని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వర్షాలు పడినా.. పడకున్నా తెలంగాణ ప్రాంతం పచ్చగా పంటలతో కళకళలాడుతూ ఉండాలన్నదే తన కోరికగా కేసీఆర్ చెప్పుకొచ్చారు.

నీళ్లకు సంబంధించిన అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. క్షుణ్ణంగా పరిశీలన జరిపిన తర్వాతే గోదావరి నీళ్లు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చామని.. వర్షాలు పడకున్నా గోదావరికి నీళ్ల సమస్య ఉండదని.. సముద్రంలోకి 1500 టీఎంసీల నీరు వృధాగా పోతుందని.. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే తెలంగాణకు తిరుగు ఉండదని చెప్పారు. ఈ సంవత్సరం కరువు ఉందని.. ఇకపై అలా ఉండకూదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నాలుగైదు సంవత్సరాల్లో కరువు రక్కసి తెలంగాణ దరిదాపుల్లో ఉండకూడదని.. రాష్ట్రంలో ఏ రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న మాట వినపడకుండా చేయటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. కరెంటు కారుచీకట్లు తొలిగిపోయినట్లేనన్నకేసీఆర్.. రానున్న రోజుల్లో క్షణం కూడా కరెంటు పోని పరిస్థితులు తీసుకొస్తామన్నారు.

తెలంగాణ సర్కారు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నామని.. మరికొద్ది రోజుల్లో ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు. ప్రజలకు తాను ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నట్లు చెప్పిన కేసీఆర్.. తాను గతంలో చెప్పినట్లు తెలంగాణ ధనిక ప్రాంతమని.. సమైక్యంలో తమను దోచుకున్నట్లుగా చెప్పిన మాట నిజమన్నారు. ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఒక విషయం స్పష్టంగా అర్థమైందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రేటు 15 శాతం ఉన్నట్లు ప్రకటించారు. గత ఏడాది ఆదాయంతో పోలిస్తే.. ఈ ఏడాది ఆదాయం 15 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రానికి దక్కని ఘనత తెలంగాణకు సొంతమైందని చెప్పుకొచ్చారు.