Begin typing your search above and press return to search.

తెలుగు మ‌హాస‌భ‌లు!..కేసీఆర్‌ - శోభ‌న్ బాబు!

By:  Tupaki Desk   |   15 Dec 2017 2:39 PM GMT
తెలుగు మ‌హాస‌భ‌లు!..కేసీఆర్‌ - శోభ‌న్ బాబు!
X
ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు కాసేప‌టి క్రితం భాగ్య న‌గ‌రి హైద‌రాబాదులో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. తెలుగు బిడ్డ‌, భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉన్న ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావు ఈ స‌భ‌ల‌ను ప్రారంభింప‌జేశారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీహెచ్ విద్యాసాగ‌ర్ రావు, తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్ త‌దిత‌ర ప్ర‌ముఖులు హాజ‌రైన ఈ స‌ద‌స్సుల ప్రారంభోప‌న్యాసంలో కేసీఆర్ ఆస‌క్తిక‌ర అంశాల‌ను ప్ర‌స్తావించారు. తెలుగు భాష అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో - ఎంత ఆసక్తో - ఎంత ప్రేమో అన్న విష‌యాల‌ను వివ‌రించే క్ర‌మంలో త‌న గురువుల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకున్న కేసీఆర్‌... త‌న విద్యార్థి ద‌శ‌ను కూడా దాదాపుగా పూర్తిగానే ఆవిష్క‌రించేశార‌నే చెప్పాలి. త‌న గురువులు త‌న‌కు చేసిన విద్యా బోధ‌న నుంచి తాను త‌న గురువుల‌ను పూజించిన తీరు - నాడు విద్యార్థుల ప‌ట్ల ఉపాధ్యాయుల‌కు ఉన్న ప్రేమ‌ - విద్యార్థుల ఉన్న‌తికి ఉపాధ్యాయులు చేసిన కృషి - ప్ర‌త్యేకించి తెలుగు భాషాభివృద్దికి నాటి పండితులు చేసిన కృషిని కేసీఆర్ ఏక‌రువు పెట్టార‌నే చెప్పాలి.

ఈ సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర అంశం కేసీఆర్ నోట వినిపించింది. పూత రేకులంటే... ఇలా నోట్లో వేసుకుంటే అలా క‌రిగిపోయే తీపి ప‌దార్థ‌మ‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. వీటి త‌యారీకి ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు ప్ర‌సిద్ధిగాంచినవిగా కూడా మ‌న‌కు తెలిసిందే. తాను విద్యార్థిగా ఉన్న ద‌శ‌లో భాష‌పై మంచి ప‌ట్టు ఉండేద‌ని - అలాగే తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకునే దాకా కూడా వ‌దిలిపెట్టేవాడిని కాద‌ని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఓ సంద‌ర్భంలో శోభ‌న్ బాబు హీరోగా న‌టించిన సినిమాను చూశాన‌ని - అందులో ఓ ర‌చయిత రాసిన పాట‌లో పూత‌రేకులు అన్న ప‌దం వివ‌నిపించింద‌ని కేసీఆర్ చెప్పారు. నాడు త‌న‌కు పూల‌ రేకులంటే తెలుసు గానీ, పూత రేకులంటే తెలియ‌ద‌ని, అస‌లు పూత రేకులంటే ఏమిట‌న్న ప్ర‌శ్న త‌న‌లో మొద‌లైంద‌న్నారు. ఆ ప‌దాన్ని స‌ద‌రు సినిమా పాట‌లో పొర‌పాటుగా పలికారేమోన‌న్న భావ‌న‌తో ఏకంగా పాట‌ల పుస్త‌కం కొన్నాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఆ పాట‌ల పుస్త‌కంలో కూడా స‌ద‌రు ప‌దం పూత‌రేకులుగానే ఉండ‌టంతో త‌న ఉపాధ్యాయుడిని అడిగాన‌ని కేసీఆర్ చెప్పారు.

అయితే పూత రేకులు అంటే నాడు త‌న మాష్టారుకు కూడా తేలియ‌ద‌ని, పూత రేకుల‌ను పూల రేకులుగానే భావించమ‌ని చెప్పార‌న్నారు. అయితే పాట‌ల పుస్త‌కంలోనూ పూత రేకుల‌నే ఉంద‌ని తాను చెప్పాన‌ని, ఆ ప‌ద‌మేంటో త‌న‌కు తెలుసుకోవాల‌ని ఉంద‌ని కూడా అడిగాన‌ని తెలిపారు. దీంతో త‌న‌లోని జిజ్ఞాస‌ను గ‌మ‌నించిన ఉపాధ్యాయుడు నాడు విజ‌య‌వాడ‌లో ఉన్న త‌న మిత్రుడికి లేఖ రాసి మ‌రీ ఆ ప‌దానికి అర్థం తెప్పించార‌న్నారు. పూత రేకులంటే తీపి ప‌ద‌మ‌ని ఆ త‌ర్వాతే తెలిసింద‌ని, అయితే అప్ప‌టికి ఆ తీపి ప‌దార్థం తెలంగాణ‌లో అడుగే పెట్ట‌లేద‌ని కూడా కేసీఆర్ చెప్పారు. అయితే ఇప్పుడు ఏ దుకాణానికి వెళ్లినా కూడా పూత రేకులు ల‌భిస్తాయ‌ని కేసీఆర్ చెప్పారు. మొత్తంగా పూత రేకుల‌ను ప్ర‌స్తావించిన కేసీఆర్‌... ఆ ప‌దంతో త‌న‌కు క‌లిగిన అనుభ‌వాన్ని చాలా ఆస‌క్తిక‌రంగా చెప్పారు.