Begin typing your search above and press return to search.

కేసీఆర్ పిలుపు!...తెలుగు వికాస‌మే ల‌క్ష్యం!

By:  Tupaki Desk   |   15 Dec 2017 6:02 PM GMT
కేసీఆర్ పిలుపు!...తెలుగు వికాస‌మే ల‌క్ష్యం!
X
ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌లు తెలంగాణ రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదులో కాసేప‌టి క్రితం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తెలుగు భాషా వికాస‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ స‌మావేశాల్లో తెలుగు భాషాభిమానులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌ల‌కు హాజ‌ర్యేందుకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా 15 ఇత‌ర రాష్ట్రాలు, 42 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు త‌ర‌లివ‌చ్చారు. అశేష భాషాభిమానుల రాక‌తో హైద‌రాబాదులోని ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఈ మ‌హాస‌భ‌ల్లో ప్రారంభోప‌న్యాసం చేసిన కేసీఆర్‌... నిజంగానే త‌న‌లో ఉన్న తెలుగుద‌నాన్ని, తెలుగు భాష‌పై త‌న‌కున్న ప‌ట్టును బ‌య‌ట‌పెట్టుకున్నారు. తెలుగు భాష‌పై త‌న‌కున్న అభిమానాన్ని ఆయ‌న చాటుకున్నారు. తొలుత తెలుగు భాషాభివృద్దికి కృషి చేసిన ప్ర‌ముఖుల‌ను స్మ‌రించుకున్న కేసీఆర్‌... అమ్మ ఒడే తొలి బ‌డి అంటూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. అమ్మ ఒడి నుంచే మ‌న జీవ‌న ఒర‌వ‌డి, నడ‌వ‌డి ప్రారంభ‌మముంద‌న్నారు. త‌ల్లి జోల‌పాట‌తోనే త‌ల్లి త‌న బిడ్డ‌కు ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తుంద‌ని, అదే స‌మ‌యంలో త‌న బిడ్డ‌ను ప్ర‌పంచానికి ప‌రిచయం చేస్తుంద‌ని కేసీఆర్ అచ్చ తెలుగు మాట‌ల‌తో త‌న ప్ర‌సంగాన్ని కొత్త పుంత‌లు తొక్కించార‌నే చెప్పాలి.

ఆ త‌ర్వాత త‌న విద్యాభ్యాసాన్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌... విద్యార్థి ద‌శ‌లో తానెంత‌గా తెలుగు భాష‌పై ప‌ట్టు సాధించానో తెలిపారు. త‌న చిన్న‌త‌నంలోనే త‌న తండ్రి మంచి ప‌ద్యాల‌ను త‌న‌కు నేర్పించార‌ని తెలిపారు. త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువుదే గొప్ప స్థాన‌మ‌ని చెప్పిన కేసీఆర్‌... గురువుల వ‌ద్ద తెలుగు భాష‌ను ఎంత ఆస‌క్తిగా, ఇష్టంగా నేర్చుకున్నాన‌ని తెలిపారు. విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో తాను నేర్చుకున్న సుమ‌తి శ‌త‌కాల‌ను కూడా కేసీఆర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. నాడు ఊరిలో బ‌డులు పెద్ద‌గా ఉండేవి కావ‌ని తెలిపిన కేసీఆర్‌... అయ్య‌వారి బ‌డిని ప్రస్తావించారు. అయ్య‌గారి బ‌డిలో గురువులు బోధించిన ప‌లు విష‌యాల‌ను చాలా విపులంగా కేసీఆర్ వివ‌రించారు. కేసీఆర్ ప్ర‌స్తావించిన ప్ర‌తి విష‌యాన్ని కూడా నుడికారాలు, తేట తెలుగు ప‌ద్యాలు, సంధులు, స‌మాసాల‌తో కూడిన ప్రాస‌ల‌తో త‌న ప్ర‌సంగాన్ని చాలా ఆస‌క్తిక‌రంగా కొన‌సాగించారు. అస‌లు సాహిత్యం అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మ‌న్న విష‌యాన్ని కూడా కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారు. తెలుగు భాష‌ను విక‌సింపజేసేందుకే ఈ ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి తాను సిద్ధ‌ప‌డ్డాన‌ని ఆయ‌న తెలిపారు.

త‌న సొంతూరుతో పాటు తాను విద్య‌న‌భ్య‌సించిన గ్రామం, తన రాజ‌కీయ ప్ర‌స్థానానికి గ‌ట్టి పునాది వేసిన సిద్దిపేట‌ల‌ను ప్ర‌స్తావించిన కేసీఆర్‌... సిద్దిపేట‌ను సాహిత్య క్షేత్రంగా అభివ‌ర్ణించారు. చెరువు గ‌ట్ల‌పై కూర్చుని తాను ప‌ద్యాలు రాశాన‌ని, తెలుగు భాష‌ను తాను ఎంత‌గా అభిమానించాన‌న్న విష‌యాన్ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప‌ద్యాల‌ను వ‌ల్లె వేసిన కేసీఆర్‌... తెలుగు భాష అభివృద్దికి కృషి చేసిన ప్ర‌ముఖుల‌ను గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష గొప్ప‌ద‌నాన్ని చాటేందుకు విశ్వ‌వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్ర‌జ‌లంతా కూడా కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఈ మ‌హాక్ర‌తువులో గురువులు, క‌వులు, ర‌చ‌యిత‌లకు గురుతర బాధ్య‌త ఉంద‌ని కూడా కేసీఆర్ గుర్తు చేశారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసే ప్ర‌తి ఒక్క‌రికి తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున సంపూర్ణ స‌హ‌కారాలు అందిస్తామ‌ని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. మొత్తంగా తెలుగు ప్ర‌పంచ మ‌హా స‌భ‌ల ఉద్దేశం... తెలుగు భాషా వికాస‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా ఈ స‌భ‌ల వేదిక‌గా కేసీఆర్ చేసిన‌ ప్ర‌సంగం జ‌నాల‌ను బాగానే ఆక‌ట్టుకుందని చెప్పాలి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కేసీఆర్ మంచి మాటకారి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే గానీ... అచ్చ తెలుగులో కేసీఆర్ ఇంత ఒందిక‌గా, పొందిక‌గా ప్ర‌సంగించ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నారు.

ప్ర‌తి సంద‌ర్భానికి అనువైన ప‌ద్యాన్నో, స‌మాసాన్నో ప్ర‌స్తావించిన కేసీఆర్‌... నిజంగానే తెలుగు భాష ముచ్చ‌ట‌ప‌డేలా ప్ర‌సంగించార‌నే చెప్పాలి. రాజ‌కీయ నేత‌గా, సీఎంగా త‌న‌పై మాట‌ల దాడికి దిగే వారిపై ఎదురు దాడి చేసే క్ర‌మంలో కేసీఆర్ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డుతున్న విష‌యం మ‌న‌కు కొత్తేమీ కాదు. తెలుగుతో పాటు ఉర్దూలోనూ అన‌ర్గ‌ళంగా మాట్లాడే స‌త్తా ఉన్న కేసీఆర్‌... ఒక్కోసారి తెలుగు, ఉర్దూను క‌లిపేసి మిక్స్ చేసిన ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసిన వైనం కూడా మ‌న‌కు తెలిసిందే. అసెంబ్లీలో, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న చేసిన ప్ర‌సంగం, వ్యంగ్యాస్త్రాలు సంధించిన వైనమూ మ‌న‌కు చిర‌ప‌ర‌చిత‌మే. అయితే తెలుగు ప్ర‌పంచ మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ప్ర‌సంగం నిజంగానే అమోఘ‌మ‌నే చెప్పాలి. త‌న ప్ర‌సంగంలో ఇత‌ర భాషా ప‌దాల‌ను అస్స‌లు వాడ‌కుండానే సాంతం తెలుగు ప‌దాలు, నుడికారాల‌ను వాడిన కేసీఆర్‌... సామాన్య జ‌నంతో పాటుగా పండితుల‌ను కూడా ఇట్టే ఆక‌ట్టుకున్నార‌ని చెప్పాలి. మొత్తంగా తెలుగు భాష మురిసిపోయేలా కేసీఆర్ ప్ర‌సంగించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.