Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ లోకి వెళితే ఓ పట్టాన తిరిగి రారే?

By:  Tupaki Desk   |   5 Nov 2015 6:49 AM GMT
ఫాంహౌస్ లోకి వెళితే ఓ పట్టాన తిరిగి రారే?
X
సమర్థ పాలనకు సెంటిమెంట్ల అవసరం ఉందా? అన్న ప్రశ్న వేస్తే.. లేదన్న మాటే వినిపిస్తోంది. అదేం చిత్రమో కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మధ్య కాలం తరచూ ఫాంహౌస్ లోకి వెళితే తిరిగి రాని పరిస్థితి. అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తమకు నచ్చిన రీతిలో పని చేసే వెసులుబాటు ఉంటుంది. నిజానికి అదేం తప్పు కూడా కాదు. కానీ.. సమస్యల్లా అది స్థాయికి మించితేనే ఇబ్బందంతా.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారమే చూస్తే.. ఆయన సచివాలయానికి రావటం దాదాపుగా మానేశారు. చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారు. ఆ విషయాన్ని అడిగే నాథుడే ఉండడు. వాస్తును విపరీతంగా నమ్మే ఆయనకు సచివాయలం వాస్తు మీద అసంతృప్తి ఉంది. దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలు కొలిక్కి రాకపోవటంతో ఆయన సచివాలయానికి రావటం లేదు.

క్యాంప్ కార్యాలయం నుంచే పనులు నిర్వహిస్తున్నారు. ఇక.. తన ఫాంహౌస్ వద్ద అయుత చాండీయాగం నిర్వహించే విషయంలో కేసీఆర్ తలమునకలుగా ఉండటం తెలిసేందే. ఆదివారం ఫాంహౌస్ వెళ్లిన ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. మరో రెండు రోజుల వరకూ ఆయన ఫాంహౌస్ నుంచి తిరిగి రారని చెబుతున్నారు. ఇక.. బుధవారం సంగతే తీసుకుంటే ఆయన ఎవర్నీ కలిసేందుకు ఇష్టపడలేదు. ఎవరికీ ఎలాంటి అపాయింట్ మెంట్లు ఇవ్వలేదు.

ముఖ్యమైన అవసరాలకు సంబంధించి కేసీఆరే ఫోన్లు చేసి సూచనలు చేస్తున్నారు. ఇదే తీరులో మరో రెండు రోజులు ఉండాలని భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. బుధవారం ఫాంహౌస్ లోపల పంటల్ని పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా పలు సలహాలు ఇచ్చిట్లుగా చెబుతున్నారు. ఇలా ఫాంహౌస్ లోకి ఒకసారి వెళతే.. రోజుల తరబడి అందులోనే ఉండిపోతున్న కేసీఆర్ తీరు విమర్శలకు అవకాశం ఇచ్చేలా ఉందన్న మాట వినిపిస్తోంది.