Begin typing your search above and press return to search.

వందల కోట్ల ఖర్చు ఎందుకో ‘కారు’ ఓనర్ చెప్పాలి?

By:  Tupaki Desk   |   8 Nov 2021 6:00 AM GMT
వందల కోట్ల ఖర్చు ఎందుకో ‘కారు’ ఓనర్ చెప్పాలి?
X
నరం లేని నాలుక ఎన్ని మాటలైనా చెబుతుంది. కానీ.. తాము మాట్లాడే మాటలు ఒకదానితో మరొకటి జత కలవనప్పుడు.. నోటి నుంచి వచ్చే మాటను విన్నంతనే.. లాజిక్ ఒకటి మదిలో మెదిలి ప్రశ్నగా మారినప్పుడు.. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేనప్పుడు.. సమయానికి తగ్గట్లు మాట్లాడతారన్న భావన ప్రజల్లో అంతకంతకూ ఎక్కువ అవుతున్నప్పుడు.. ఏం మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న కనీస విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నారన్నది పెద్ద ప్రశ్న.

హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా మార్చిందెవరు? అన్ని ఉప ఎన్నికల మాదిరే ఇది కూడా ఒకటి అన్నట్లు సాదాసీదా కాకుండా.. ఎన్నికకు ఆర్నెల్ల ముందు నుంచి పార్టీ మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలను మొహరించాల్సిన అవసరం ఏముంది? ఈటలకు నచ్చలేదు రాజీనామా చేశారు.. ఉప ఎన్నిక వచ్చింది.. మేం పోటీ చేస్తాం.. ప్రజాతీర్పు కోరుతామని సింఫుల్ గా తేల్చేదానికి.. సదరు ఎన్నిక సీఎం వర్సెస్ ఈటల అన్నట్లుగా మార్చింది కేసీఆరే కదా? అలాంటి ఆయన.. తాజాగా ప్రెస్ మీట పెట్టి.. ఓడితే భూమి బద్ధలు కాదు కదా? అంటూ ప్రశ్నించటంలో అర్థం లేదనే చెప్పాలి.

అంతేనా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ కొత్త సంప్రదాయాల్ని తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో వాటన్నింటికి ఆయన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నది ఆయన మరచిపోకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరిగితే.. అయ్యే ఖర్చుకు.. హుజూరాబాద్ ఉప ఎన్నికకు పెట్టిన ఖర్చుకు ఏమైనా పొంతన ఉందా? అంతెందుకు.. ఓటుకు రూ.6వేల నుంచి రూ.10వేల వరకు అధికార టీఆర్ఎస్ నేతలు పంచారంటూ పోటెత్తిన వార్తా కథనాలకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?

ఓడిపోతే భూమి బద్దలు కానప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమిటి? దళిత బంధు అనే ప్రత్యేక పథకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ విస్త్రత ప్రయోజనాల కోసమే తెచ్చారనే అనుకుందాం. అలాంటప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏమిటి? దళితులను పైకి తేవటమే లక్ష్యమని కేసీఆర్ భావించినప్పుడు దళితులు ఎక్కువగా ఉంటే.. నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎందుకు అమలు చేయనట్లు? లాంటి ప్రాథమిక ప్రశ్నలు ఎన్నో తలెత్తే పరిస్థితి.

ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసినంతనే కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ‘ఓడితే భూమి బద్దలవుతుందా?’ అన్న మాట ఏ మాత్రం అతకనట్లుగా మారి.. ఆయన మాటల్లోని డొల్లతనం సాదాసీదా ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి. తన నోటి మాటను ఆయుధంగా మార్చి అసాధ్యమైన తెలంగాణ సాధనను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు అదే ‘మాట’ను ప్రజలకు ‘విషయం’ అర్థమయ్యేలా చేయటమేమిటి? కాలం ఆయనలో తీసుకొచ్చిన మార్పునకు ఇదో నిదర్శనమా? అన్నది ప్రశ్నగా మారింది.