Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫాంహౌజ్ ఏం చేస్తున్నారంటే....

By:  Tupaki Desk   |   28 May 2016 8:14 AM GMT
కేసీఆర్ ఫాంహౌజ్ ఏం చేస్తున్నారంటే....
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన ఫాంహౌజ్‌ లో ఏం చేస్తున్నారు? రాజ‌కీయాల ప‌రంగా కీల‌క ప‌రిణామాలు జ‌రుగుతున్న సంద‌ర్భాలు - రాష్ట్రంలో అకాల‌వ‌ర్షాల‌తో న‌ష్టం వచ్చి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన సంద‌ర్భం ఉన్న నేప‌థ్యంలో నాల్రోజులుగా త‌న వ్య‌వ‌సాయ‌క్షేత్రంలోనే ఎందుకు ఉండిపోయారు? అనే చ‌ర్చ‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వ‌స్తోంది.

కేసీఆర్ త‌న ఫాంహౌజ్‌ కు త‌ర‌చుగా వెళ్ల‌డం - అక్క‌డ రోజుల త‌ర‌బ‌డి ఉండ‌టం అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా గ‌డిపేందుకు వెళ్లిన కేసీఆర్ ఈ ద‌ఫా అక్క‌డ్నుంచే కీల‌క ప‌రిణామాల‌కు శుభం కార్డు వేశారు. పెద్ద‌ల స‌భ‌కు పంపే ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ఖ‌రారు చేశారు. దాంతోపాటు మ‌రో ఎమ్మెల్సీని సైతం మండ‌లికి పంపించారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న త‌న పాంహౌజ్‌ లో రాబోయే పంట‌కాలం గురించి ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటు ఫాంహౌజ్‌ కు వేస్తున్న ప్ర‌హారీ గోడ గురించి సూచ‌న‌లు ఇచ్చారు.

ఒక రైతుగా -పార్టీ అధినేత‌గా సొంత ప‌నులు రాజ‌కీయ వ్య‌వ‌హారాల గురించి ఎవ‌రికీ అభ్యంత‌రం లేకున్నా ప‌రిపాల‌న ప‌ర‌మైన అంశాల్లో కేసీఆర్ వేస్తున్న అడుగులు స‌రికాద‌నే అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. అకాల వ‌ర్షాల స‌హాయ‌క చ‌ర్య‌ల విష‌యంలో ప్ర‌భుత్వాధినేతగా కార్య‌క్షేత్రంలోకి దిగాల్సిన స‌మ‌యంలో త‌న పాంహౌజ్‌ లో సొంత వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దుకోవ‌డం గ‌ర్హ‌నీయమంటున్నారు. ఇప్ప‌టికే స‌చివాల‌యానికి వెళ్ల‌కుండా క్యాంప్ ఆఫీస్ నుంచే అధికారిక స‌మీక్ష‌లు చేసేస్తున్న కేసీఆర్ హైద‌రాబాద్‌ కు కూడా దూరంగా ఉండ‌టం ఏమిట‌నే చ‌ర్చ‌లు పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి.