Begin typing your search above and press return to search.

రూ.10వేలకే అంత రచ్చ జరిగింది.. రూ.10లక్షలకు ఇంకేం జరుగుతుందో?

By:  Tupaki Desk   |   16 Aug 2021 12:30 PM GMT
రూ.10వేలకే అంత రచ్చ జరిగింది.. రూ.10లక్షలకు ఇంకేం జరుగుతుందో?
X
చాలా తెలివైనోళ్లు సైతం చిన్న లాజిక్ మిస్ అయి.. అడ్డంగా బుక్ అవుతుంటారు. వేల కొద్దీ పుస్తకాలు చదివి.. మేథోసంపత్తితో పాటు వర్తమాన రాజకీయాల్ని ఎలా నడిపించాలన్న విషయంపై తన దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరించటం ఆయనకు మాత్రమే చెల్లింది. మాటలతో ఇట్టే కన్వీన్స్ చేసే సత్తా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావి సైతం.. కేసీఆర్ ను తెగ పొగిడేస్తుంటారు. ఆయన తెలివికి ఆయన ప్లాట్ అయినట్లుగా ఉండవల్లి మాటల్ని చూస్తే అర్థమవుతుంది. అలాంటి కేసీఆర్.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేసిన ఎత్తు ఆయన్ను దెబ్బ తీస్తుందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

విపక్షాలు అన్నవి లేకుండా చేయటమే ఇప్పుడున్న రాజకీయమన్న మాట పలువురి నోట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పని పూర్తి చేసిన కేసీఆర్ ఒక విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది. విపక్షం అన్నది లేకుండా కేసీఆర్ ప్రయత్నం చేసిన ప్రతిసారి.. సవాలు మరింత బలంగా ఎదురవుతుందన్నది మర్చిపోకూడదు. అలానే.. తాను చేపట్టే జనాకర్షక పథకాలతో తిరుగులేని పొలిటికల్ మైలేజీని సొంతం చేసుకోవాలనుకునే ఆయన వ్యూహం ఎదురుదెబ్బలు తినిపించటం ఖాయమంటున్నారు.

ఈ రోజు నుంచి తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంతో కేసీఆర్ సర్కారుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందన్నది విశ్లేషకుల మాట. అదెలా అన్నది ఉదాహరణతో సహా చెబుతున్నారు. పాత విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన ఎన్నికలకు కాస్త ముందు అనూహ్యంగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు వరదనీటి తాకిడికి గురయ్యాయి. దీంతో.. నష్టపోయిన ప్రతి వారికి రూ.10వేల చొప్పున ఇస్తామని చెప్పటం.. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున పంపిణీ మొదలుపెట్టటం తెలిసిందే.

రూ.10వేల సాయం కోసం పెద్ద పెద్ద క్యూలు ఏర్పడటమే కాదు.. దీనికోసం జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. పథకం మొదలై సమయంలో బాగానే ఉన్నా.. రోజులు గడిచే కొద్దీ ప్రభుత్వానికి కొత్త తరహా తలనొప్పులు ఎదురుకావటంతో ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వందల కోట్లు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోవటం.. అంతకంతకూ రూ.10 వేల కోసం పెరిగిన అభ్యర్థనల నేపథ్యంలో పంపిణీ మధ్యలో ఆపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావటంతో వెనక్కి తగ్గి.. మళ్లీ పంపిణీ చేశారు.

రూ.10వేల పంపిణీతో గ్రేటర్ ఎన్నికల్లో తమకు తిరుగులేని అధికారం ఖాయమని.. గత ఎన్నికల్లో 99 సీట్లు ఇచ్చిన గ్రేటర్ ప్రజలు తాజా వంద ప్లస్ సీట్లు ఖాయమన్న మాట చాలా బలంగా.. ఆత్మవిశ్వాసంతో చెప్పేవారు. కానీ.. గ్రేటర్ ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే. రూ.10వేల సాయం కూడా తమ గెలుపు అవకాశాల్ని దెబ్బ తీసిందని.. ఈ సాయం అందరికి చేరకపోవటంతో ఆగ్రహం చెందిన ఓటర్లు తమను ఓడించారని టీఆర్ఎస్ నేతలు తమ ప్రైవేటు సంభాషణల్లో చెప్పటం తెలిసిందే.

రూ.10వేలకే అంత రచ్చ జరిగినప్పుడు దళిత బంధు పేరుతో రూ.10లక్షలు బ్యాంకు అకౌంట్లో వేస్తామన్న మాట చెప్పిన తర్వాత.. దాని అర్హత సంపాదించుకోవటానికి దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించటం ఖాయమంటున్నారు. రూ.10వేల కోసమే గ్రేటర్ హైదరాబాద్ లో అంత రచ్చ జరిగిప్పుడు ఈ రోజున రూ.10లక్షల కోసం హుజూరాబాద్ లో ఇంకెంత రచ్చ జరుగుతుందో ఆలోచించటానికి కూడా ధైర్యం చాలట్లేదంటున్నారు. రూ.10లక్షల సాయం ప్రకటించే వేళలో.. మేధావి కేసీఆర్ కు గ్రేటర్ లోని రూ.10వేల సాయం ఎపిసోడ్ ఎందుకు గుర్తుకు రానట్లు చెప్మా?