Begin typing your search above and press return to search.

ప్లాన్ బి ని బ‌య‌ట‌కు తీయ‌నున్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   31 July 2017 5:01 AM GMT
ప్లాన్ బి ని బ‌య‌ట‌కు తీయ‌నున్న కేసీఆర్‌
X
రాజ‌కీయ‌నేత‌ల‌కు వ్యూహం దీర్ఘ‌కాలికంగా ఉండాలి. ఇందులో మ‌రో మాట‌కు అవ‌కాశ‌మే లేదు. ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా ముందుగా ఉంటార‌ని చెబుతారు. ఏపీ ముఖ్య‌మంత్రి మాదిరి క్ష‌ణం తీరిక లేదు.. ద‌మ్మిడి అభివృద్ది లేద‌న్న‌ట్లు కాకుండా.. కేసీఆర్ చాలా చాలా తీరిగ్గా ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటారు. ఇదంతా వ్యూహ మ‌హిమ త‌ప్పించి మ‌రొక‌టి కాదు.

నియోజ‌క‌వ‌ర్గాల పెంపు విష‌యంలో నిన్న‌టి వ‌ర‌కూ ఉన్న ఆశ‌లు ఆవిరి అయిన నేప‌థ్యంలో.. కొత్త త‌ర‌హా వ్యూహానికి కేసీఆర్ తెర తీయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో సీట్ల పెంపు ఖాయ‌మ‌న్న భావ‌న‌తో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌ల్ని పార్టీలోకి తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

సీట్ల పెంపుతో.. సర్దుబాటు క‌ష్టం కాద‌న్న ఆలోచ‌న ఉండేది అయితే.. అది అసాధ్య‌మ‌న్న విష‌యం ఈ మ‌ధ్య‌నే ముగిసిన ప్ర‌ధాని మోడీతో జ‌రిగిన భేటీలో స్ప‌ష్ట‌మైన నేప‌థ్యంలో కేసీఆర్ ప్లాన్ బిని బ‌య‌ట‌కు తీయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ప్లాన్ ఎ ప్ర‌కారం.. సీట్ల‌ను పెంచే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తుంటే.. పార్టీలోకి తీసుకొచ్చిన నేత‌ల‌కు ప్లేస్ మెంట్ల‌కు పెద్ద క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ.. అందుకు భిన్నంగా మోడీ ఆలోచ‌న‌లు ఉండ‌టంతో ఇప్పుడు కేసీఆర్ ముందుస్తుగా సిద్ధం చేసుకున్న ప్లాన్ బిను తెర మీద‌కు తేనున్న‌ట్లుగా చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో పార్టీని సంస్థాగ‌తంగా మ‌రింత బ‌లోపేతం చేయ‌టంతో పాటు.. సీట్లు ల‌భించే అవ‌కాశం లేని బ‌ల‌మైన నేత‌ల్ని బుజ్జ‌గించ‌టం.. సార్వ‌త్రి ఎన్నికల‌కు ముందే వారికి ప్లేస్ మెంట్లు ఇచ్చే ప్ర‌క్రియ‌కు తెర తీయ‌న్నార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. అస‌మ్మ‌తిని వీలైనంత మినిమైజ్ చేసే అంశం మీద కేసీఆర్ ఫోక‌స్ చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు మూడేళ్ల‌కు పైనే అవుతున్నా.. జిల్లాల వారీగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కొత్త జిల్లాల ఏర్పాటు సంద‌ర్భంలో మాత్రం జిల్లా నేత‌ల‌తో ప‌రిమిత స్థాయిలో మాత్ర‌మే స‌మావేశాలు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో జిల్లాల వారీగా పార్టీ అంశాల్ని చ‌ర్చించేందుకు వీలుగా ప్ర‌త్యేక స‌మావేశాల్ని నిర్వ‌హించ‌టం.. త్వ‌ర‌లోనే రాష్ట్ర క‌మిటీల నుంచి నియోజ‌క‌వ‌ర్గ క‌మిటీల వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌టం.. నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీని మ‌రింత ముమ్మ‌రం చేయ‌టం లాంటివి చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌న తాను ఏర్పాటు చేసిన 31 జిల్లాల‌కు చెందిన నేత‌ల‌తోనూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఆయా జిల్లాల ప‌రిధిలోని ఎంపీలు.. ఎమ్మెల్యేల‌తో పాటు.. ప‌ద‌వులు ఆశించే వారితోనూ.. కిందిస్థాయినేత‌లు.. పంచాయితీ స్థాయి వ‌ర‌కూ వివిధ ద‌శ‌ల్లో ఉండే ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఆహ్వానించి వారిని మోటివేట్ చేయ‌టం ప‌నిగా పెట్టుకోనున్నారు. మొత్తంగా చూస్తే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేసుకుంటున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అధికార ప‌క్షాల్లో క‌నిపించే అసంతృప్తులు.. సొంత గూట్లో ఉండే చికాకుల‌కు టీఆర్ ఎస్ అతీతం కాదు. నేత‌ల మ‌ధ్య విభేదాలు బోలెడ‌న్ని ఉన్నా.. అధినేత వాటిని ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇదంతా వ్యూహంలోని భాగ‌మేన‌ని చెప్పాలి. కేసీఆర్ లాంటి బ‌ల‌మైన‌.. ప్ర‌జాక‌ర్ష‌క నేత‌కు పార్టీ నేత‌లు అణిగిమ‌ణికి ఉండ‌టం మామూలే. తాజా ప్లాన్ ప్ర‌కారం.. అలాంటి నేత‌ల్ని ద‌గ్గ‌ర కూర్చొబెట్టుకొని వారిలోని అసంతృప్తుల్ని తొల‌గించే ప్ర‌య‌త్నానికి తెర తీస్తార‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్లు స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ నేత‌ల మ‌ధ్య ఉండే పంచాయితీల్ని వీలైనంత త్వ‌ర‌గా సెట్ చేసి.. అంద‌రిని ఒకే తాటి మీద‌కు తెచ్చే విష‌యంలో ఎలాంటి త‌ప్పులు దొర్ల‌కూడ‌ద‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. సో.. వ‌రుస స‌మీక్ష‌లు.. స‌మావేశాల సీజ‌న్ షురూ అయిన‌ట్లేన‌న్న మాట‌.