Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు మ‌ద్ద‌తంటూ ప్ర‌క‌ట‌న‌లు..మ‌ర్మం ఇదే!

By:  Tupaki Desk   |   2 Oct 2018 4:45 AM GMT
కేసీఆర్‌ కు మ‌ద్ద‌తంటూ ప్ర‌క‌ట‌న‌లు..మ‌ర్మం ఇదే!
X
వంద సీట్లు గెలుస్తాం..ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌త్య‌ర్థుల‌కు ముఖం చెల్ల‌దు.. ఇలాంటి మాట‌లు బోలెడు చెప్పిన కేసీఆర్ కు ఇప్పుడు ఫ‌లానా వారు.. తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నామ‌న్న ప్ర‌క‌ట‌న‌లు అవ‌స‌ర‌మా? అంటే.. లేద‌నే స‌మాధానం వినిపిస్తుంటుంది. దీనికి భిన్నంగా ఒకే రోజున రెండు భిన్న వ‌ర్గాలు చేసిన మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న వెనుక అస‌లు కార‌ణం వేరే ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రికి ప్ర‌త్యేకంగా ఫ‌లానా వారి మ‌ద్ద‌తు ఇప్పుడు అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. తాము వంద సీట్లు ప‌క్కాగా గెలుస్తామ‌న్న ధీమాను రోజుకు నాలుగుసార్లు వ్య‌క్తం చేస్తున్నారు. ఓ ప‌క్క ధీమాగా మాట‌లు చెబుతూనే.. మ‌రోవైపు టీఆర్ ఎస్ కు ఫ‌లానా వారి మ‌ద్ద‌తు ఉంద‌న్న ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు చేస్తున్నార‌న్న కోణంపై దృష్టి పెడితే ఆస‌క్తిక‌ర కోణం క‌నిపిస్తోంది.

సోమ‌వారం సంగ‌తే చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ కు జ‌మాత్ ఎ హింద్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. భారీగా చ‌నిపోయిన కొండ‌గ‌ట్టు బ‌స్సు బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లేందుకు టైం లేని సీఎం.. త‌న పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌న్న మాట చెప్పేందుకు.. ఎన్నిక హామీల్లో త‌మకు ఇవ్వాల్సిన వాటి గురించి స‌ల‌హాలు ఇచ్చేందుకు టైం ఇవ్వ‌టం గ‌మ‌నార్హం.

సోమ‌వారం జ‌మాత్ ఎ హింద్ నేత‌లు ప‌లువురు కేసీఆర్‌ను క‌లిశారు. ముస్లింల‌కు ఏమేం చేయాలో లిస్ట్ చెప్పారు. టీఆర్ ఎస్ ఎన్నిక హామీలో ముస్లింల‌కు ఉప ప్ర‌ణాళిక‌ను ప్ర‌క‌టించాలంటూ భారీ కోర్కెల జాబితాను ఇచ్చారు. వీటిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. ఈ అంశాల‌పై దృష్టి సారించాల‌ని పార్టీ మేనిఫేస్టో క‌మిటీకి సూచించారు. ఇదిలా ఉంటే.. మ‌రోవైపు అంగ‌న్ వాడీ టీచ‌ర్ల సంఘం నేత‌లు కేసీఆర్ కుమార్తె క‌వితను క‌లిశారు. 31 జిల్లాల‌కు చెందిన బాధ్యులు క‌విత‌ను క‌లిసి.. త‌మ పూర్తి మ‌ద్ద‌తు టీఆర్ ఎస్‌ కే ఉంటుంద‌ని చెప్పారు.

మ‌రోవైపు మాల మ‌హానాడు నిజామాబాద్ జిల్లా సంఘంతో పాటు ఉమ్మ‌డి జిల్లాల్లోని అన్ని మాల సంఘాల నేత‌లు క‌విత‌ను క‌లిశారు. ఎందుకంటారా? త‌మ పూర్తి మ‌ద్ద‌తు టీఆర్ ఎస్‌ కే అన్న విష‌యాన్ని క‌విత‌కు స్ప‌ష్టం చేయ‌టం కోసం కావ‌టం గ‌మ‌నార్హం. అయితే.. ఇదంతా కూడా కేసీఆర్ మాయాజాలంగా అభివ‌ర్ణిస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఊహించ‌ని రీతిలో టీఆర్ ఎస్ వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతుంద‌న్న ప్ర‌చారం ఎక్కువ అవుతోంది.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ అండ్ కో త‌మ పాత ఆయుధాన్ని బ‌య‌ట‌కు తీసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్య‌మం సమ‌యంలో.. ఉద్య‌మంలో టీఆర్ ఎస్ పాత్ర త‌గ్గిపోతుంద‌న్న భావ‌న క‌లిగినా.. టీఆర్ ఎస్ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోతుంద‌న్న ప్ర‌చారం ఎక్కువైనా.. వ‌రుస పెట్టి వివిధ జిల్లాల‌కు చెందిన ప‌లు వ‌ర్గాల‌కు చెందిన వారు టీఆర్ ఎస్‌ లో చేరుతున్న‌ట్లుగా.. ఉద్య‌మంలో టీఆర్ ఎస్ పాత్ర‌కు ప్ర‌భావితం అయిన‌ట్లుగా చెబుతూ పార్టీలో చేరేవారు. ఇంచుమించు ఇదే వ్యూహాన్నితాజాగా మ‌రోమారు అమ‌లు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. వంద సీట్లు గెలుస్తాన‌ని చెప్పే కేసీఆర్ ధీమా లెక్క ఎక్క‌డో తేడా కొట్టింద‌న్న మాటను నిజం చేసేలా తాజా ప‌రిణామాలు నిరూపిస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.