Begin typing your search above and press return to search.

తనను మస్తు తిట్టినోళ్లకే కేసీఆర్ పదవులు ఇస్తాడా?

By:  Tupaki Desk   |   10 May 2020 2:30 AM GMT
తనను మస్తు తిట్టినోళ్లకే కేసీఆర్ పదవులు ఇస్తాడా?
X
విన్నంతనే నిజమా? అన్న అనుమానం కలిగినా.. లోతుల్లోకి వెళ్లి చూస్తే నిజమనిపించే విషయమిది. సాధారణంగా రాజకీయాల్లో అనుసరించే వ్యూహాలకు భిన్నంగా ఎత్తులు వేస్తుంటారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్. రోటీన్ రాజకీయాలకే తప్పించి.. ఉద్యమ రాజకీయాలకు ఏ మాత్రం అవకాశం లేదన్న వేళ.. ఉద్యమ పార్టీని ఏర్పాటు చేయటమే కాదు.. సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేయటంలో కేసీఆర్ సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.

తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నంతనే విశ్రమించటం కేసీఆర్ వ్యతిరేకం. అందరూ నిర్లక్ష్యంగా ఉండే వేళలో.. మరింత అప్రమత్తంగా ఉండటం సారుకు అలవాటుగా చెబుతారు. వాస్తవానికి ఈ అలవాటే ఆయనకు వరంగా మారిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ వేసే రాజకీయ ఎత్తుల్ని చూసినా.. ఆయన పదవులిచ్చే నేతల బ్యాక్ గ్రౌండ్ చూసినా.. కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఎవరిదాకానో ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసే దమ్ము.. ధైర్యం తలసాని సొంతం. సారు మీద ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు మరెవరూ చేయలేదనే చెప్పాలి. అలాంటి తలసానిని జేబులో మనిషిలా చేసుకోవటం చూస్తే.. కేసీఆర్ రాజకీయ చాతుర్యం ఇట్టే అర్థమైపోతుంది. తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ అధికారపక్షంగా అవతరించిన తర్వాత.. ఊహించని విధంగా తలసానిని పార్టీలోకి తీసుకోవటమే కాదు.. పార్టీలో చేరిన రోజునే మంత్రి పదవిని అప్పజెప్పి సంచలనానికి తెర తీశారు.

తెలంగాణలోని ఉద్యమ నేతలంతా అవాక్కు అయ్యేలా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఉద్యమంలో తనను వ్యతిరేకించిన వారు.. విమర్శించిన వారికి టికెట్లు.. పదవులు ఇవ్వటం ఆయనకే చెల్లు. ఎందుకిలా అంటే.. దానికో వ్యూహం ఉందంటారు. తనను బలంగా తప్పు పట్టినోళ్లే తన ప్రత్యర్థులైనప్పుడు.. అలాంటి వారిని పవర్ తో తన పాకెట్ లోకి చేర్చేసుకునే విలక్షణతను కేసీఆర్ ప్రదర్శిస్తారు.

అప్పటికే ఉన్న నేతలు బయటకు వెళ్లకుండా.. బయట ఉన్న పవర్ ఫుల్ నేతల్ని పార్టీలోకి తీసుకోవటం ద్వారా ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఒక్కతలసాని మాత్రమే కాదు.. ఈ రోజున కేసీఆర్ కేబినెట్ ను చూస్తే.. ఎర్రబెల్లి దయాకర్ మొదలుకొని.. పలువురు నేతలు టీఆర్ ఎస్ లో కనిపిస్తారు. వీరంతా ఒకప్పుడు కేసీఆర్ పై తిట్ల వర్షాన్ని కురిపించినోళ్లే. ఏ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి.