Begin typing your search above and press return to search.

కోదండరాంపై టీఆర్ఎస్ అంచనా ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   10 Jun 2016 9:04 AM GMT
కోదండరాంపై టీఆర్ఎస్ అంచనా ఏంటో తెలుసా?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ అదినేత కేసీఆర్ దూర‌దృష్టికి ఇదో నిద‌ర్శ‌నం. రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో విశ్లేషించి అడుగులు వేయ‌డంలో ముందుండే గులాబీ ద‌ళ‌ప‌తి ఇపుడు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రామ్‌ పై సైతం ఇదే స్కెచ్ వేస్తున్నారు. టీఆర్‌ ఎస్ నేతలు - మంత్రులు కోదండ‌రాంపై అనూహ్యంగా పెద్దఎత్తున దాడి ప్రారంభించడానికి కారణం కూడా రాజకీయ జేఏసీ పార్టీ రూపు దాలుస్తుందా అనే సందేహ‌మే కార‌ణంగా చెప్తున్నారు.

తెలంగాణ ఉద్యమ కాలంలో టీజేఏసీ అంటే తెలంగాణలోని టీఆర్‌ ఎస్ - బీజేపీ - టీడీపీ - కాంగ్రెస్ - న్యూడెమోక్రసీ పక్షాల క‌ల‌యిక‌. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్ జేఏసీకి నాయకత్వం వహించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. టీజేఏసీలో పార్టీలేవీ లేవు. అందులో మిగిలింది తెలంగాణ విద్యావంతుల వేదిక ఒక్కటే. తెలంగాణ రెండవ ఆవిర్భావ దినోత్సవానికి మూడు నాలుగు రోజుల ముందు ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించిన కోదండరామ్ అమెరికాలో తెలంగాణ సంఘాల సమావేశానికి వెళ్లి వచ్చిన తరువాత వెంటనే ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ‘చేతకాకపోతే ప్రభుత్వం దిగిపోవాలి’ అని హెచ్చరించడం వెనుక రాజకీయం ఉందనేది టీఆర్‌ ఎస్ అనుమానం.ఈ నేపథ్యంలో టీజేఏసీని క్రమంగా రాజకీయ పక్షంగా మార్చడానికి కోదండరామ్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం బలంగా ఉంది. మ‌రోవైపు తెలంగాణ సంక్షేమమే టీజేఏసీ లక్ష్యం అని కోదండరామ్ చెబుతున్నా అంతిమంగా రాజకీయ పార్టీగా మారుస్తారని టీఆర్‌ ఎస్ నాయకత్వం భావిస్తోంది.

ఈ ప‌రిణ‌మాల‌న్నింటి రీత్యానే రెండేళ్ల టీఆర్‌ ఎస్ ప్రభుత్వంపై జేఏసీ చైర్మన్ హోదాలో కోదండరామ్ చేసిన విమర్శలపై మంత్రులు - ఎంపీలు తీవ్రస్థాయిలో స్పందించారని అంటున్నారు. కోదండరామ్‌ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి విమర్శ చేయకపోయినా మంత్రులందరూ తీవ్రంగా స్పందించడం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్తున్నారు. తక్షణం కాకపోయినా భవిష్యత్తులో టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానిని దృష్టిలో పెట్టుకునే టీఆర్ ఎస్‌ కు టీజేఏసీకి ఇకపై ఎలాంటి సంబంధం లేదనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే కోదండరామ్ విమర్శలపై తీవ్రంగా స్పందించినట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు కేసీఆర్ మౌనం వ‌హించ‌డం ఆయ‌న వ్యూహాత్మ‌క వైఖ‌రికి ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు.