Begin typing your search above and press return to search.

హుజూర్‌ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఇదేనా..?

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:39 AM GMT
హుజూర్‌ నగర్ లో కేసీఆర్ వ్యూహం ఇదేనా..?
X
హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ అధికార టీఆర్ ఎస్ ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగురవేయాలని సీఎం కేసీఆర్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈక్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - బీజేపీల‌ను ఉమ్మ‌డిగా టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ప్ర‌చార పర్వం మరో వారం రోజుల్లో ముగియనుండగా.. ఆ పార్టీ నేతలు పూర్తిగా ఈ రెండు పార్టీల రహస్య మైత్రిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఆర్ ఎస్ నాయ‌కుల ప్రచార శైలి - ప్రసంగాలు - ప్రకటనలు ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

టీఆర్ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ - రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్‌) ప్రకటనలు కానీ - ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌ రెడ్డి వరసగా చేస్తున్న ప్రచార ప్ర‌సంగాలు దీనికి అద్దం పడుతున్నాయి. 2018 ముందస్తు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కోల్పోయిన ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు టీఆర్ ఎస్‌ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు - మంత్రులు - పార్టీ నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

గత ఎన్నికల్లో హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేసిన బీజేపీకి కేవలం 15వందల పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా, ఈ సారి ఆ పార్టీ పోటీ చేయడం కేవలం పరోక్షంగా కాంగ్రెస్‌ కు ప్రయోజనం చేకూర్చేందుకే అన్న అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లేందుకు టీఆర్ ఎస్‌ ప్రాధాన్యం ఇస్తోంది. జాతీయ స్థాయిలో బద్ద శత్రువులుగా ఉండే ఈ రెండు పార్టీలు ఇక్కడ మాత్రం ఒక్కటయ్యాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి సందర్భం వచ్చిన ప్రతీ సారి ప్రసంగాల్లో పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం. అయితే టీఆర్ ఎస్ వ్యూహం ఏ మేర‌కు స‌ఫ‌లీకృతం అవుతుందో తెలియాంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.