Begin typing your search above and press return to search.

స‌బ్ క‌మిటీ వేసేయ్‌.. విష‌యాన్ని నాన్చేయ్‌

By:  Tupaki Desk   |   17 Sep 2021 3:30 PM GMT
స‌బ్ క‌మిటీ వేసేయ్‌.. విష‌యాన్ని నాన్చేయ్‌
X
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం వివిధ రంగాల్లోని స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందించి త‌గిన రీతిలో ప‌రిష్కారాలు చూపాల్సి ఉంటుంది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ద‌గ్గ‌ర నుంచి అన్ని విష‌యాల‌పై స‌త్వ‌ర‌మే స్పందించాల్సిన అస‌వ‌రం ఉంది. విష‌యాన్ని నాన్చ‌కుండా.. స‌మ‌స్య‌ను తేల్చ‌కుండా ఆల‌స్యం చేయ‌డం స‌రికాదు. కానీ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఏ రంగంలో స‌మ‌స్య‌లు ఉన్నా.. వాటిని త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌కుండా నాన్చుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేబినేట్ స‌బ్ క‌మిటీ (మంత్రి వ‌ర్గ ఉప సంఘం)లు వేసి కాలాయాప‌న చేస్తున్నార‌నే టాక్ ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొత్త జిల్లాల ఎంపిక మొద‌లు ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ విష‌యాల‌పై కేసీఆర్ స‌బ్ క‌మిటీలు వేస్తూనే ఉన్నారు. కొవిడ్ కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మారిన పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌, రెవెన్యూ స‌మీక‌ర‌ణ‌, ఆసుప‌త్రుల ప‌నితీరు, క్రీడా విధానం, విద్యా సంస్థ‌లు.. ఇలా వివిధ రంగాల్లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కేసీఆర్ ఆధ్వ‌ర్యంలోని మంత్రివ‌ర్గం ఇలా వివిధ కేబినేట్ స‌బ్ క‌మిటీల‌ను నియ‌మించింది. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఈ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవ‌డం మంచిదే. కానీ వాటితో ఎంత త్వ‌ర‌గా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త లేదు. కేబినేట్ స‌బ్ క‌మిటీ పేరుతో అందులో స‌భ్యులైన మంత్ర‌లు స‌మావేశం నిర్వ‌హించ‌డం.. ఏదో ప్ర‌తిపాద‌న‌లు సిఫార్సులు సిద్ధం చేశామ‌ని ప్ర‌క‌టించ‌డం ఆ త‌ర్వాత వాటి వైపు మ‌ళ్లీ క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డం.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో కొత్త క్రీడా విధానం కోసం స‌బ్ క‌మిటీ వేసి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్ప‌టికీ ఎలాంటి కొత్త విధానాన్ని ప్ర‌క‌టించ‌లేదు. స‌మావేశాలు.. చ‌ర్చ‌లు.. ప్ర‌తిపాద‌న‌ల స్వీక‌ర‌ణ పేరుతో కాల‌యాపన చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా స‌బ్ క‌మిటీలో చ‌ల‌నం లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే వేసిన స‌బ్ క‌మిటీలు త‌మ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌డం లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మరో మూడు కేబినేట్ స‌బ్ క‌మిటీల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పోడు భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓ క‌మిటీ, కొత్త జిల్లాల్లోని పోలీస్ స్టేష‌న్ల‌లోని స‌మ‌స్య‌లు, అవ‌స‌రాల‌ను ప‌మీక్షించేందుకు మ‌రో క‌మిటీ, ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో త‌లెత్తుతున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇంకో క‌మిటీని ప్ర‌భుత్వం నియ‌మించింది.

ఎన్నో ఏళ్లుగా వ్య‌వ‌సాయం చేసుకుంటున్న పోడు భూముల్లో ఇప్పుడు ప్ర‌భుత్వం ప‌ల్లె ప్ర‌గ‌తి కింద పార్కులు ఇత‌ర నిర్మాణాలు చేప‌ట్ట‌డాన్ని స్థానిక రైతులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల ఆగ్ర‌హంతో ఉన్న రైతులు అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులూ చేస్తున్నారు. మ‌రోవైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్ తెచ్చిన‌ప్ప‌టి నుంచి స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో స‌త్వ‌ర‌మే ఈ విష‌యాల‌పై దృష్టి సారించి ఆ స‌మ‌స్య‌పై స‌మగ్ర నివేదిక తెప్పించుకుని ఓ ప‌రిష్కారం చూప‌కుండా ఇలా స‌బ్ క‌మిటీల పేరుతో కాలాయాప‌న చేయ‌డం స‌రికాద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏమ‌న్నా అంటే. . స‌బ్ క‌మిటీ వేశాం క‌దా! చ‌ర్చ‌లు సాగుతున్నాయి అని చెప్ప‌డానికి త‌ప్ప ఈ క‌మిటీల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజనం ఉండ‌డం లేద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.