Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మెను దెబ్బ తీయటంలో కేసీఆర్ సక్సెస్

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:18 AM GMT
ఆర్టీసీ సమ్మెను దెబ్బ తీయటంలో కేసీఆర్ సక్సెస్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త విచిత్రంగా ఉంటుంది. తనను తాను మోస్ట్ పవర్ ఫుల్ గా పీలయ్యే ఆయన తీరుకు తగ్గట్లే.. ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు తోడు కావటంతో ఆయనకు ఆయన అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆయనకు సరిసాటైన ప్రతిపక్ష నేత ఎవరూ లేకపోవటం కూడా పెద్ద కొరతే.

ఇదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చూస్తే.. ఉద్యోగుల న్యాయమైన కోరికలకు ప్రజల్లో అంత పెద్ద స్పందన లేదన్నట్లుగా పరిస్థితులు చెబుతున్నాయి. దీనికి కారణం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉంటే.. ఆ మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని.. తాము చేస్తున్నది తమ జీతాల పెంపు కోసం కాదని.. ఆర్టీసీని బతికించుకోవటానికంటూ సంఘాల ప్రతినిధులు చెబుతున్నా ప్రజల చెవుల్లోకి వెళ్లని పరిస్థితి.

ఆర్టీసీ ఉద్యోగులకు సరాసరి రూ.50వేల జీతాలంటూ ప్రభుత్వం నుంచి వచ్చిన మాటకు సరైన కౌంటర్ లేకపోవటంతో అది నిజమని నమ్మే పరిస్థితి ప్రజలది. సగటు ఆర్టీసీ కార్మికుడి జీతంతో పాటు.. ఒక డ్రైవర్.. కండక్టర్ కు వచ్చే జీతాలు ఎంత తక్కువగా ఉంటాయన్న విషయంతో పాటు.. వారి శ్రమ ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయటంలో ఆర్టీసీ సంఘాలు ఫెయిల్ అయ్యాయి.

దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వస్తే ఆయన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన.. ఆర్టీసీ సమ్మె ఉద్యోగులు తిన్నది అరగక చేసేదిగా అభివర్ణించటం తెలిసిందే. ఉద్యమాలు చేసే వారిని ఎంత చులకనగా మాట్లాడొచ్చన్న విషయంలో కేసీఆర్ తో పోటీ పడే వారెవరూ ఉండరని చెప్పాలి.

సుదీర్ఘ ఉద్యమాన్ని నడిపిన ఒక అధినేత.. మరో ఉద్యమాన్ని ఇంతలా చులకన చేయటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైనదిగా చెప్పాలి. అదే సమయంలో కేసీఆర్ మాదిరి మాటలతో ప్రజల్ని ఆకట్టుకునేలా చేయటం.. తాము చేస్తున్న సమ్మె ఎంత న్యాయసమ్మతమైనదన్న విషయాన్ని ప్రజల్లోకి వెళ్లేలా చేయటంలో జరిగిన తప్పులు కేసీఆర్ కు లాభం చేశాయని చెప్పక తప్పదు. కలిసొచ్చే కాలంలో ఇలాంటివే జరుగుతాయి మరి.