Begin typing your search above and press return to search.

మోడీ బ‌డ్జెట్ చూశారుగా.. మంచిగా చేయండి!

By:  Tupaki Desk   |   3 Feb 2019 6:12 AM GMT
మోడీ బ‌డ్జెట్ చూశారుగా.. మంచిగా చేయండి!
X
తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప‌ని తీరు మీదా.. కేసీఆర్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల మీద ఏ మాత్రం అవ‌గాహ‌న ఉన్నా.. మోడీ స‌ర్కారు తాజాగా ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం స్ఫూర్తి ఏమిట‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన రైతుబంధు ప‌థ‌కాన్ని కాపీ కొట్టి మ‌రీ మోడీ మాష్టారి ముద్ర వేసుకున్న వైనంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మోడీకి కాపీ కొట్ట‌టం కూడా రాదా? అన్న ఎట‌కారాలు చేసే వారి సంఖ్య అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. రైతుబంధు ప‌థ‌కానికి.. మోడీ స‌ర్కారు ప్ర‌క‌టించిన కిసాన్ స‌మ్మాన్ నిధికి ఏ మాత్రం పోలిక లేద‌ని తేల్చేస్తున్నారు.

తాజాగా మోడీ సర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్ మీద కేసీఆర్ స్పంద‌న ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి తెర దించుతూ తాజాగా ఆయ‌న ఎలా రియాక్ట్ అయ్యార‌న్న దానిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. శ‌నివారం కీల‌క అధికారుల‌తో భేటీ అయిన ఆయ‌న‌.. కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు విన్న‌పాలు చేసినా.. కేంద్రంలో చ‌ల‌నం రాలేద‌ని.. ఈసారి మొత్తంగా చూస్తే బ‌డ్జెట్ లో క్లారిటీ మిస్ అయిన‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ రైతుల‌కు మేలు చేసే రైతుబంధు ప‌థ‌కంపై మూడేళ్లు క‌స‌ర‌త్తు చేసి అమ‌లు చేశామ‌ని.. రైతుల వివ‌రాలు ప‌క్కాగా తీసుకొని.. ప‌థ‌కాన్ని రెండు విడ‌త‌లుగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా విజ‌య‌వంతంగా పూర్తి చేసిన‌ట్లుగా చెప్పారు. అదే స‌మ‌యంలో కేంద్రం తాజాగా ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం హ‌డావుడిగా చేప‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని.. ఎలాంటి స‌క‌ర‌త్తు చేయ‌లేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

తాజాగా ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ నిరాశాజ‌న‌కంగా ఉంద‌ని.. రాష్ట్రానికి ఏమీ ఇవ్వ‌లేద‌న్న అసంతృప్తితో ఉన్న కేసీఆర్‌.. బ‌డ్జెట్ ను జాగ్ర‌త్త‌గా త‌యారు చేయాల‌న్న సూచ‌న‌ను అధికారుల‌కు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు. కేంద్ర ప‌థ‌కాల‌కు.. ప‌న్నుల వాటా రూపేణా వ‌చ్చే నిధుల మీద స్ప‌ష్ట‌త వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఆర్థిక పరిస్థితి.. ఇత‌ర అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని బ‌డ్జెట్ నుత‌యారు చేయాల‌న్న సూచ‌న‌ను ఆయ‌న చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రి.. కేసీఆర్ ఆకాంక్ష‌ల్ని తెలంగాణ అధికారులు బ‌డ్జెట్ లో ఎలా ప్ర‌తిబింబిస్తార‌న్న అంశంపై క్లారిటీ రావ‌టానికి మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.