Begin typing your search above and press return to search.

రామ్ నాథ్‌ ను ఈశాన్యంలో కూర్చోబెట్టిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 Jun 2017 6:21 AM GMT
రామ్ నాథ్‌ ను ఈశాన్యంలో కూర్చోబెట్టిన కేసీఆర్‌
X
తెలిసిన మంచిని న‌లుగురికి చెబితే మంచిద‌ని చెబుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్ష‌రాల ఇదే ప‌ని చేస్తుంటారు. వాస్తు.. జ్యోతిష్యం లాంటివి కేసీఆర్‌కు ఎంత న‌మ్మ‌క‌మో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌తి ఒక్క‌రికి ఈ విష‌యం మీద చాలానే అవ‌గాహ‌న ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు.

కొంద‌రితో నోరు విప్పేందుకు సైతం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. మ‌రికొంద‌రి విష‌యంలో తానే చొర‌వ తీసుకొని స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌ట‌మే కాదు.. వారు దాన్ని న‌మ్మేలా చేస్తారు. కేసీఆర్‌లో ఉన్న మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కోణం ఏమిటంటే.. ఆయ‌న ఢిల్లీకి వెళ్లి ప్ర‌ముఖుల్ని క‌లిసిన ప్ర‌తిసారీ వారి అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లుగా వారి మ‌దిని దోచేలా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. మ‌రి.. కేసీఆర్ ఇచ్చిన స‌ల‌హాను వారు పాటిస్తారా? అంటే.. క‌చ్చితంగా. ఎందుకంటే.. పాటిస్తారని అర్థ‌మైన‌పుడే అత‌ను స‌ల‌హాలు ఇస్తుంటారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద‌ళితుడ్ని నియ‌మించ‌మ‌ని ప్ర‌ధాని మోడీకి కేసీఆర్ ఇచ్చిన స‌ల‌హాను తాజాగా చూపిస్తున్నారు గులాబీ నేత‌లు. ఆ మాట‌కు వ‌స్తే.. గ‌తంలో ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీని క‌లిసిన ప్ర‌తిసారీ ఆయ‌న‌కు ఏదో స‌ల‌హా ఇచ్చి రావ‌టం తెలిసిందే.

రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీజేపీ డిసైడ్ చేసిన రామ్ నాథ్ కోవింద్ నామినేష‌న్ దాఖ‌లు కార్యక్ర‌మానికి హాజ‌ర‌య్యారు కేసీఆర్‌. ఆ మాట‌కు వ‌స్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లువురు బీజేపీ సీఎంలు.. మిత్ర‌ప‌క్షాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు.. తోపుల్లాంటి నేత‌లు ఎంద‌రో హాజ‌ర‌య్యారు. అయితే.. వారెవ‌రూ చేయ‌ని ప‌నిని కేసీఆర్ చేశార‌ని చెప్పాలి. వాస్తును విప‌రీతంగా న‌మ్మే కేసీఆర్‌.. నామినేష‌న్ సంద‌ర్భంగా రామ్ నాథ్ ఏ దిక్కున కూర్చొని నామినేష‌న్ వేస్తే మంచిద‌న్న విష‌యాన్ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. రామ్ నాథ్ జాత‌కం ప్ర‌కారం ఆయ‌న ఈశాన్యం దిక్కున కూర్చొని నామినేష‌న్ వేస్తే మంచిద‌న్న సూచ‌న‌ను చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

రామ్ నాథ్ ఏ సుముహుర్తంలో నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్నారు? ఎటువైపు కూర్చొని నామినేష‌న్లు వేస్తున్నారు? అంటూ బీజేపీ ముఖ్యుల్ని వాక‌బు చేసిన కేసీఆర్‌.. ఆపై అమిత్ షాతో మాట్లాడుతూ.. ఈశాన్యం ముచ్చ‌ట‌ను చెప్పారు. కేసీఆర్ మాట‌ల‌కు త‌గిన‌ట్లుగా మార్పులు చేయ‌టం గ‌మ‌నార్హం. కేసీఆర్ చెప్పిన‌ట్లే.. రామ్ నాథ్ కూర్చునే స్థానం ఈశాన్యంలో ఉండేలా మార్పులు చేయించారు. నామినేష‌న్ స‌మ‌యంలో రెండో వ‌రుస‌లో కూర్చున్న కేసీఆర్‌.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ ఏ సీట్లో కూర్చోవాలో చెప్ప‌టం కాసింత విశేష‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/