Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్లారిటీ:అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇద్దాం

By:  Tupaki Desk   |   26 March 2018 1:07 PM GMT
కేసీఆర్ క్లారిటీ:అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇద్దాం
X
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్ట‌కేల‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఏఅధికార తెలుగుదేశం పార్టీ - ప్ర‌తిప‌క్ష వైసీపీ స‌హా ఆయా పార్టీలు కేంద్రంపై ప్ర‌వేశ‌పెడుతున్న‌ అవిశ్వాస తీర్మానంపై త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రగతి భవన్‌ లో తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో టీఆర్‌ ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎట్ట‌కేల‌కు కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అడ్డు తగలకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తో భేటీ అనంత‌రం ఎంపీలు కే. కేశవరావు - జితేందర్ రెడ్డి - క‌విత‌ మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో ఇతర పార్టీల అవిశ్వాస తీర్మానాలను మేము అడ్డుకుంటున్నామని కొందరు చెప్పడం అబద్ధమ‌ని తెలిపారు. టీడీపీ - వైసీపీ అవిశ్వాసం పెట్టకముందు నుంచి ఆందోళన చేస్తున్నామ‌న్నారు. మేమే అడ్డుపడుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందని అయితే, అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. లోక్‌ సభలో అవిశ్వాసంపై చర్చకు వస్తే సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్‌ ఎస్ ఎంపీలు వెల్ల‌డించారు. రెండు రాష్ర్టాలు బాగుండాలన్నదే త‌మ అభిమతమ‌న్నారు. సభలో నిరసనలు చేసినా ఉపయోగం లేకుండా పోతుందని వివ‌రించారు. రిజర్వేషన్ల అంశం విషయమై పట్టుదలతో ఉన్నామ‌న్నారు. రిజర్వేషన్లపై మాది న్యాయబద్దమైన పోరాటమ‌ని టీఆర్ ఎస్ ఎంపీలు తెలిపారు. ఏపీకి రావాల్సిన హక్కులపై తాము చాలాసార్లు మద్దతు తెలిపామ‌న్నారు.

ఎవరికి ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశంపై రాష్ర్టాలకే అధికారం ఇవ్వాలని త‌మ డిమాండ్ అని టీఆర్ ఎస్ ఎంపీలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు చేయాల్సి ఉందని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతున్నామ‌న్నారు. రిజర్వేషన్ల విషయమై ఇప్పటికే సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీతోనూ మాట్లాడార‌ని అయితే లోక్‌సభలో ఆందోళన చేస్తున్న కేంద్రం వినిపించుకోవడం లేదన్నారు.

కేంద్రం వైఖరి దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంద‌ని, రిజర్వేషన్ల అధికారం రాష్ర్టాలకే ఇవ్వాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాస్తుందన్నారు.