Begin typing your search above and press return to search.

కేసీఆర్ కేబినెట్ కూర్పులో ఊహించని నిర్ణయాలు

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:50 AM GMT
కేసీఆర్ కేబినెట్ కూర్పులో ఊహించని నిర్ణయాలు
X
తెలంగాణ పాలిటిక్సు సస్పెన్స్ థ్రిల్లర్‌ ను తలపిస్తున్నాయి. మొన్నటివరకు ఎన్నికల్లో విజయం ఎవరిది? కేసీఆర్ గెలుస్తారా.. ప్రజాకూటమా... లేదంటే హంగ్ వస్తుందా అంటూ అంతా తెగ చర్చించుకున్నారు. అయితే, ఫలితాలు విడుదల కావడంతో ఆ సస్పెన్సుకు తెరపడింది. ఇప్పుడు కొత్తగా మరో సస్పెన్సు మొదలైంది... గత కేబినెట్ లోని మంత్రులు నలుగురు ఓడిపోయారు కదా.. వారి స్థానంలో ఎవరిని మంత్రులుగా తీసుకుంటారు..? మిగతావారిలో ఎవరినైనా తప్పిస్తారా.. ఓడిన మంత్రుల్లో ఎవరికైనా పదవి ఇచ్చి ఆ తరువాత ఎమ్మెల్సీని చేసే చాన్సుందా వంటి అనేక ప్రశ్నలతో తెలంగాణ పాలిటిక్సులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.

మంత్రి పదవులపై ఊహాగానాల విషయానికొస్తే అనేక అంచనాలు - ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కొందరి పేర్ల విషయంలో మాత్రం విశ్వసనీయమైన - బలమైన సమాచారం అందుతోంది.

ప్రస్తుత మంత్రివర్గంలోని కోందరు సీనియర్లను పక్కన పెడతారని టాక్. శాసనమండలి నుంచి మంత్రివర్గంలో స్థానం పొందిన కడియం శ్రీహరి - నాయిని నర్సింహరెడ్డితో పాటు - ఆర్ధిక మంత్రిగా మంత్రివర్గంలో కొనసాగుతున్న ఈటెల రాజేందర్‌ కు కొత్త మంత్రివర్గంలో స్ధానం లభించే అవకాశం లేదని టీఆర్‌ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొని ఆయనను శాసనమండలి సభ్యునిగా ఎన్నుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసిన జూపల్లి కృష్ణారావు - తుమ్మల నాగేశ్వర రావు - పట్నం మహేందర్‌రెడ్డి - చందూలాల్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారి స్ధానంలో రంగారెడ్డి - ఖమ్మం - మహబూబ్‌ నగర్ - వరంగల్ జిల్లా ల నుంచి కొత్త వారికి మంత్రివర్గంలో స్ధానం లభించే అవకాశం ఉందని టాక్.

మంత్రివర్గంలో మహిళలకు ఈసారి స్ధానం ఉండే అవకాశం ఉండడంతో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు రేసులోకి వచ్చారు. ఉప సభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి - ప్రభుత్వ విప్ గొంగిడి సునీత - ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ లు మంత్రిపదవిని అశిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మంత్రి కావడం ఖాయమని టీఆర్‌ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్థిక మంత్రి ఈటెలను స్పీకర్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆయన స్థానంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆర్థికమంత్రిని చేసే అవకాశాలున్నాయి. నిన్న వరకు ఆయన పేరు హోం మంత్రి పదవికి వినిపించినా మహమూద్ అలీకి ఆ పదవి దక్కడంతో ఆయనకు ఆర్థిక శాఖ ఇవ్వొచ్చని చెబుతున్నారు.