Begin typing your search above and press return to search.

మునుగోడులో రెండు.. మూడు స్థానాలు ఎవరికో చెప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   4 Sep 2022 4:32 AM GMT
మునుగోడులో రెండు.. మూడు స్థానాలు ఎవరికో చెప్పిన కేసీఆర్
X
ఎప్పుడైనా.. ఎక్కడైనా ఉప ఎన్నిక జరుగుతుందంటే అందరి చూపు గెలుపు ఎవరిదన్న దాని మీదనే ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా త్వరలో జరిగే అవకాశం ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. విజేతగా ఎవరు నిలుస్తారన్న దాని మీదనే కాదు.. రెండు.. మూడు స్థానాల్లో ఎవరు నిలుస్తారన్న దానిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మిగిలిన ఉప ఎన్నికల మాదిరి కాకుండా తెలంగాణ రాజకీయ గతిని మార్చే శక్తితో పాటు.. రెండు.. మూడు స్థానాల్లో నిలిచే పార్టీల భవిష్యత్తు కూడా తేలనుంది.

అందుకే.. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు విజేత? అన్న ప్రశ్నతో పాటు రెండో స్థానం ఎవరిది? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మునుగోడు ఉప పోరుపై జోస్యం చెప్పటం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ భారీగా పెరిగిందని.. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ జోరు తగ్గినట్లుగా ప్రచారం జరుగుతున్న వేళ.. అదంతా ఉత్తదేనన్న విషయాన్ని ఫ్రూవ్ చేసుకునేందుకు మునుగోడు ఉప పోరు ఒక అవకాశంగా మారిందని చెప్పాలి.

అందుకే.. ఏం చేసైనా సరే.. మునుగోడులో గులాబీ జెండా తప్పక ఎగరాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా.. దేనికైనా సిద్ధం.. ఏమైనా చేద్దామనే మాట ఆయన నోటి నుంచి వింటున్నట్లుగా గులాబీ నేతలు చెబుతున్నారు. గులాబీ బాస్ ఎలా అయితే.. మునుగోడు విజయంపై పట్టుదలతో ఉన్నారో.. కాంగ్రెస్.. బీజేపీలు సైతం అదే రీతిలో ఉండటంతో.. ఈ ఉప పోరు రోటీన్ ఉప ఎన్నికలకు భిన్నమైన పిక్చర్ ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

మునుగోడు ఉప పోరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ గులాబీ బాస్.. గెలుపు అవకాశం ఎవరిదన్న దానితో పాటు రెండు.. మూడు స్థానాల్లో ఎవరుంటారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన సమావేశాల్లో ఆయన మునుగోడు ఉప పోరు ప్రస్తావన తేవటమే కాదు.. అక్కడి పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని వివరించారు. మునుగోడులో బీజేపీ అసలు పోటీలోనే లేదని.. సర్వేల ప్రకారం టీఆర్ఎస్ కు 41 శాతం.. కాంగ్రెస్ కు 32 వాతం.. బీజేపీకి 8 నుంచి 9 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తారని.. రెండో స్థానంలో కాంగ్రెస్.. మూడోస్థానంలో బీజేపీ నిలవటం ఖాయమన్నారు. అంతేకాదు.. ఎవరూ చేయనంత సంక్షేమం తమ ప్రభుత్వం చేసిందని.. అందుకే విజయం గ్యారెంటీ అన్న ధీమాను వ్యక్తం చేశారు కేసీఆర్. మునుగోడులో రైతుబంధు లబ్దిదారులే లక్ష మంది ఉన్నారని.. మునుగోడు నియోకవర్గంలోని ప్రతి రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా వేస్తామని.. సదరు ఎమ్మెల్యే వెళ్లేటప్పుడు తమ నియోజకవర్గంలోని ముఖ్యనేతలను కూడా అక్కడకు తీసుకెళ్లి బాధ్యతలు అప్పజెప్పాలన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది ముఖ్యనేతలు మునుగోడు వెళ్లాలన్న కేసీఆర్ మార్గదర్శనం చూస్తే.. ఏం చేసైనా మునుగోడులో గులాబీ జెండా ఎగరటమే లక్ష్యమన్న విషయం స్పష్టమవుతుంది. మరి.. తుది ఫలితం కేసీఆర్ అనుకున్నట్లే ఉంటుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.