Begin typing your search above and press return to search.

గెలవాలంతే.. కేసీఆర్ కఠిన నిర్ణయం..

By:  Tupaki Desk   |   8 Aug 2018 4:50 AM GMT
గెలవాలంతే.. కేసీఆర్ కఠిన నిర్ణయం..
X
అధికారం రుచిమరిగితే ఆ కుర్చీ దిగబుద్ది కాదు.. ప్రతిపక్షంలో ఎంత కొట్లాడిన ఏం లాభముండదని తెలుసు.. 13ఏళ్లుగా తెలంగాణ కోసం కొట్లాడి.. ఎన్నో అవమానాలు భరించి బలమైన కాంగ్రెస్ ను తెలంగాణలో ఓడించి గద్దెనెక్కారు కేసీఆర్.. నాలుగేళ్లు గడిచాయి.. అధికారంలో ఉన్న పేరు - ప్రఖ్యాతలు - గౌరవం అంతా ఇంతకాదు.. ప్రజలకు సేవ చేయడంతోపాటు దేశవ్యాప్తంగా తమనుతాము నిరూపించుకునే అవకాశం దక్కింది. అంతటి సువర్ణవకాశాన్ని వదలుకోకూడదని కేసీఆర్ గట్టి నిర్ణయం తీసుకున్నారు.

గడిచిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్కటే ధ్యేయం.. అందుకే సాధ్యం అవుతుందా కాదా అన్న విషయాలను ఆలోచించకుండా రుణమాఫీని ప్రకటించేసింది. వృద్ధాప్య పింఛన్ ను 1000కి పెంచింది. ఇక ఎన్నో ఆచరణకు కష్టమైన పథకాలన్నీ ప్రవేశపెట్టింది. కానీ గద్దెనెక్కాకే తెలిసింది. వాటిని అమలు చేయడం అంత ఈజీ కాదని..

కేసీఆర్ ప్రకటించిన రుణమాఫీని అమలు చేయడానికి ఆపసోపాలు పడ్డాడు. అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేకపోవడం.. ఆర్బీఐ మోకాలడ్డడంతో రుణమాఫీని 4 సంవత్సరాల్లో నాలుగు దఫాలుగా అమలు చేశారు. ఇది రైతులకు సంతృప్తిని ఇవ్వలేదు. పైగా రుణమాఫీ విషయంలో కేసీఆర్ మోసం చేశాడనే అపవాదు వచ్చింది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఇప్పుడు కేసీఆర్ ప్రయోగించిన ఆయుధాన్నే వాడుతోంది. ఇదే కేసీఆర్ ను పునరాలోచనలో పడేసింది.

ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అధికారమే లక్ష్యంగా అసాధ్యమయ్యే హామీలిస్తున్నారు. ఈ మధ్య పీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 1000 పింఛన్ ను డబుల్ చేసి 2000 ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ ఇస్తున్న పథకాలన్నింటికి డబుల్ ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు అలివికాని హామీలిస్తున్నారు.. ఎలాగైనా గెలవాలనే తపనతో కాంగ్రెస్ ఈ హామీలు గుప్పిస్తోంది.

అందుకే తాజాగా కేసీఆర్ రుణమాఫీ విషయంలో వెనక్కిపోయి అధికారాన్ని కోల్పోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఎందుకొచ్చిన తంటా అని భావించి కేసీఆర్ తాజాగా మరోసారి రుణమాఫీకి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈసారి లక్ష రూపాయల వరకే.. ఇలా అధికారంలోకి రావడానికి ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం దక్కకుండా చేయాలని కేసీఆర్ చేస్తున్న ఈ ప్లాన్ ఆచరణ సాధ్యం అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. కానీ ఏ చిన్న విషయంలో కూడా నిర్లక్ష్యం వహించవద్దని కేసీఆర్ ముందుకెళ్తుండడం... తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.