Begin typing your search above and press return to search.

బడ్జెట్ పై కేసీఆర్ సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   15 Feb 2019 7:06 AM GMT
బడ్జెట్ పై కేసీఆర్ సంచలన నిర్ణయం
X
ఏదీ చేసినా.. ఎవ్వరికీ తెలియకుండా.. నిగూఢంగా చేసే కేసీఆర్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ - హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికీ రెండు నెలలు గడిచినా మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఆశావహుల కళ్లు కాయలు కాస్తున్నాయి. కేసీఆర్ మాత్రం తీరిగ్గా ఫాంహౌస్ - హైదరాబాద్ లో సేదతీరుతున్నారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ తేదీలను ఖరారు చేసి కేసీఆర్ సంచలనం రేపారు.ఈనెల 22న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని.. 25వ తేదీన ముగుస్తాయని అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ఇచ్చారు.

22న ఉదయం 11.30 గంటలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 23న బడ్జెట్ పై చర్చ.., 25న ద్రవ్య వినిమియ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖకు సపరేట్ మంత్రియే నియామకం కాలేదు. మరి బడ్జెట్ ను కేసీఆర్ ప్రవేశపెడతారా.? అప్పటికి కేబినెట్ ను విస్తరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తాలు లేవని కేసీఆర్ మొదట ఆగారు. కానీ ఈనెల 6 నుంచి మంచి ముహూర్తాల కాలం వచ్చినా కేసీఆర్ విస్తరణ చేపట్టలేదు. అయితే తాజాగా అసెంబ్లీలో బడ్జెట్ తేదీలు ఖరారు కావడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. బడ్జెట్ పై కేసీఆర్ ప్రగతి భవన్ లో సుధీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు. విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులను చేస్తున్నారు. ఈ మేరకు నిధులపై అధికారులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేస్తున్నారు.

ఆర్థిక మంత్రి లేకుండా బడ్జెట్ పై సమీక్షిస్తున్న కేసీఆర్.. బడ్జెట్ ను కూడా ముఖ్యమంత్రి హోదాలో తానే ప్రవేశపెడుతారా అన్న సందేహం సర్వత్రా నెలకొంది. కేసీఆర్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఆర్థిక మంత్రి లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో కేసీఆర్ తన సన్నిహితులు - మేధావులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో సీఎం హోదాలో జలగం వెంగళరావు అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇదే రీతిలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి చివరి వరకు గుంభనంగా వ్యవహరించే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..