Begin typing your search above and press return to search.

అయిననూ మనం పల్లెత్తు మాట అనరాదు!

By:  Tupaki Desk   |   28 July 2017 5:30 PM GMT
అయిననూ మనం పల్లెత్తు మాట అనరాదు!
X
ఏపీలోని తెలుగుదేశం నాయకుల పరిస్థితిని గమనిస్తే ఒక రకంగా జాలి కలుగుతోంది. 2019 ఎన్నికల్లో వారి పార్టీ దారుణంగా ఓడిపోతుందని.. తెలంగాణ ముఖ్యమంత్రి సర్వే వివరాలంటూ తన అంచనాలను బయటపెట్టిన తర్వాత, ఆయన మీద తెదేపా నేతల్లో కోపం వెల్లువలా వస్తోంది. కానీ కేసీఆర్ ను ధాటిగా విమర్శించడానికి మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు. పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి మీద తాము ఎలాంటి విమర్శలు చేస్తే.. అవి ఎలా పరిణమిస్తాయో అని భయపడుతున్నారు. ఆయనకు కోపం వచ్చేలా తమ విమర్శలు ఉంటే గనుక.. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్న కేసులను ఒక్కసారి తిరగతోడాడంటే పుట్టి మునుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎంత కోపం ఉన్నప్పటికీ నోరెత్తకుండా పడి ఉండాలని డిసైడవుతున్నారు.

నిజానికి తెలుగుదేశం నాయకులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. చంద్రబాబునాయుడు ఒకవైపు మరో ఇరవై ఏళ్లపాటూ తానే ముఖ్యమంత్రిగా ఉండి.. రాజధానిని సమస్తం అపూర్వంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి కానుకగా అందిస్తానంటూ సెలవిస్తుంటారు. అదే సమయంలో లోకేష్ లాంటి వాళ్లు కూడా చంద్రబాబునాయుడు గారు ఇంకా ఎన్ని దశాబ్దాలు పాలించబోతున్నారో తమకు తోచినట్టు సెలవిస్తుంటారు. కేబినెట్ సహచరులు - చంద్రబాబు భజన పరులందరూ.. వైఎస్ జగన్ ఎప్పటికైనా జైల్లో కూర్చోవాల్సిన వ్యక్తే అని.. ఆయన దక్షతను నమ్మి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని అంటూ ఉంటారు. వారు తమ తెలుగుదేశం పరిస్థితి దివ్యంగా ఉందని ప్రజల్ని నమ్మించడానికి ఇన్ని రకాలుగా నానా పాట్లు పడుతూ ఉంటే.. ఇటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సింపుల్ గా తెలుగుదేశం ఓటమి ఖాయం అని చెప్పేశారు.

ఇదే కేసీఆర్ కొన్ని నెలల కిందట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయమై తాను సర్వే చేయించానంటూ.. తమ గులాబీ పార్టీకి 106 సీట్లు దక్కుతాయని, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండే సీట్లకు పరిమితం అవుతుందని సెలవిచ్చి ఓ సంచలనానికి తెరతీశారు. ఇప్పటిదాకా ఆ సర్వే ఫలితాలపై చర్చోపచర్చలు విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాను చేయించిన సర్వే అని చెప్పకుండానే, ఓ మిత్రుడు చెప్పిన వివరాలు అని ఉటంకిస్తూ.. ఏపీలో తెలుగుదేశం ఓటమిని కేసీఆర్ నిర్దేశించారు. అందుకు ఆయన మీద ఆవేశం మిన్నంటుతున్నా.. ఓటుకు నోటు కేసులో తెలంగాణ పోలీసు శాఖ వద్ద తమ అధినాయకుడి భవిష్యత్తు చిక్కుబడిపోయి ఉన్నందున మౌనం పాటించడమే ఉత్తమం అని తెలుగుదేశం వారు అనుకుంటున్నారట. చంద్రబాబు కేసులు అనేవి.. తెలంగాణ సర్కారు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటాయి గనుక.. తాముకేసీఆర్ ను తిట్టకుండా ఉంటే మేలని భావిస్తున్నారట.